వనపర్తిలో విషాదం.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య

వనపర్తి, వెలుగు: కుటుంబ కలహాల కారణంగా ఓ మహిళ ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన వనపర్తిలో మంగళవారం జరిగింది. టౌన్‌‌ ఎస్సై హరిప్రసాద్‌‌ తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తిలోని గణేశ్‌‌నగర్‌‌కు చెందిన నఫీసాబేగం (35), నిరంజన్‌‌ దంపతులు ఉంటున్నారు. వీరికి హబీబ్‌‌ (7), సనాబేగం (5), అబ్దుల్‌‌ రహమాన్‌‌ పిల్లలు ఉన్నారు. నఫీసాబేగం, నిరంజన్‌‌ మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. గతంలో మతపెద్దలు, ఇరువర్గాల పెద్దలు సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది. 

సోమవారం మరోసారి గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన నఫీసాబేగం మధ్యాహ్నం పిల్లలను స్కూల్‌‌ నుంచి తీసుకొస్తానని చెప్పి వెళ్లింది. మధ్యాహ్నం హబీబ్, సనా బేగంను తీసుకొని తమ ఇంటి సమీపంలోని తాళ్లచెరువుకు చేరుకొని నీళ్లలో దూకింది. సాయంత్రమైనా మహిళ, పిల్లలు తిరిగి రాకపోవడంతో భర్త కుటుంబసభ్యులు పలు చోట్ల వెతికారు. మంగళవారం చెరువులో ఓ మహిళ ఇద్దరు పిల్లల మృతదేహాలు తేలుతుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న నఫీసా బేగం కుటుంబ సభ్యుల చెరువు వద్దకు చేరుకొని చనిపోయింది నఫీసాబేగం, హబీబ్‌‌, సనాబేగంగా గుర్తించారు.