అల్లూరి జిల్లాలో ఘోరం: కరెంటు షాక్తో.. తల్లి, ఇద్దరు పిల్లలు మృతి..

అల్లూరి జిల్లాలో ఘోరం జరిగింది.. కరెంటు షాక్ తగిలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. సోమవారం ( డిసెంబర్ 9, 2024 ) జరిగిన ఈ ఘటనకు సంబందించిన వివరాలిలా ఉన్నాయి..జిల్లాలోని పెదబయలు మండలం కిముడుపల్లెలో విద్యుత్ షాక్ తో తల్లి కొడుకు, కూతురు ముగ్గురు ఒకేసారి మృతి చెందారు. తీగపై బట్టల ఆరబెడుతుండగా కరెంట్ షాక్‌ తగిలి ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

ఘటన జరిగిన సమయంలో తల్లి కొడుకును రక్షించేందుకు ప్రయత్నించగా..ఆమెకు కూడా కరెంటు షాక్ తగిలింది. ఆ తర్వాత కూడా కూతురు కూడా రావడంతో ఆమెకు షాక్ తగిలి అక్కడిక్కడే మృతి చెందింది.

ఇలా ఒకేసారి తల్లి, కొడుకు, కూతురు ఒకేసారి కరెంటు షాక్ తో మృతి చెందిన ఘటన వారి కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.అయితే, మృతురాలికి మరో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని సమాచారం. మిగిలిన ఇద్దరు చిన్నారులను పట్టుకొని వాళ్ల నాన్నమ్మ కన్నీరు మున్నీరు అవుతున్న దృశ్యం స్థానికుల హృదయాలను కలిచివేసింది.గ్రామానికి చెందిన కుటుంబంలో ముగ్గురు ఒకేసారి మృతి చెందటంతో కిముడుపల్లెలో విషాద ఛాయలు అలుముకున్నాయి.