రోడ్డు ప్రమాదంలో తల్లీకూతుళ్లు దుర్మరణం

వికారాబాద్ జిల్లా: వేగంగా వచ్చిన ఓ లారీ బైక్ ను ఢికొట్టిన దుర్ఘటనలో తల్లీకూతుళ్లు ప్రాణాలు కోల్పోయారు. తృటిలో తండ్రీకొడుకులు గాయాలతో బయటపడ్డారు. ప్రమాదానికి కారణమైన లారీ అంతకుముందే మరో బైకును ఢీకొట్టింది. ఈ ఘోరమైన సంఘటన జూన్ 19న సాయంత్రం తాండూరు కాగ్నానది శివారులో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..  బంటారం మండలం సల్‌బత్తాపూర్ గ్రామానికి చెందిన కోస్గి నర్సింలు తన భార్య అనిత(25), కూతురు చిట్టి(1), కుమారుడుతో కలిసి బైక్ యాలాల మండల కేంద్రంలోని ఆధార్ కేంద్రానికి వెళ్లి సాయంత్రం తిరిగి వస్తున్నారు. 

కాగ్నానది బ్రిడ్జి సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న లారీ బైకును ఢీకొట్టింది. వెనుక బైకుపై ఉన్న తల్లీ అనిత, కూతురు చిట్టి కిందపడిపోయారు. అనిత తలకు తీవ్రగాయాలు కాగా, కూరుతు చిట్టిపై నుంచి లారీ దూసుకెళ్లింది. ప్రమాదానికి కారణమైన లారీ అంతకుముదే బాలరాజు, లక్ష్మీ అనే దంపతులు ప్రయాణిస్తున్న బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

లారీ ఢీకొన్న ప్రమాదంలో భార్య, కుమార్తెలను కోల్పోయిన నర్సింలు బోరున విలపిస్తున్నాడు. విషయం తెలుసుకున్న యాలాల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తల్లీ, కూతుళ్ల మృతదేహాలను తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ విఠల్ రెడ్డి బాధితులను కలిసి జరిగిన ప్రమాదంపై వివరాలు సేకరించి.. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తు్న్నారు.