బిజినెస్ డెస్క్, వెలుగు: అప్పులు కావాలంటే బ్యాంకులు,ఇ తర ఆర్థిక సంస్థల ఆఫీసుల చుట్టూ తిరగడమనేది పాత మాట..... ఆయా బ్యాంకుల వెబ్సైట్లు లేదా మొబైల్ యాప్‌ల ద్వారా మనం ఇంట్లోనే కూర్చొని అప్లయ్ చేసుకోవడం ఇప్పుడు కొత్త ట్రెండ్. కరోనా వచ్చినప్పటి నుంచి ఇల్లు కదలని జనం..అప్పుల కోసం కూడా ఆన్‌లైన్‌పైనే ఆధారపడుతున్నారు. బంగారంపై అప్పులు తీసుకోవడం బాగా పెరిగిన నేపథ్యంలో చాలా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు), ఫిన్‌టెక్ కంపెనీలు కస్టమర్ల ధోరణిలో మార్పులకు అనుగుణంగా గోల్డ్‌లోన్ ఎట్ యువర్ డోర్‌స్టెప్ సర్వీసులు మొదలెట్టాయి.
ఎవరెవరు ముందున్నారు...
ఫెడరల్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు వంటి బ్యాంకులు ఐఐఎఫ్ఎల్, ఇండెల్ మనీ, మణప్పురం వంటి గోల్డ్‌లోన్ ఎన్బీఎఫ్సీలు, రూపీక్, రుప్టోక్, ధన్దార్ గోల్డ్ వంటి ఫిన్‌టెక్ కంపెనీలు ఇలా గోల్డ్‌లోన్ ఎట్ యువర్ డోర్‌స్టెప్ సర్వీసులను తెచ్చాయి. ఇలా ఇంట్లో కూర్చునే గోల్డ్ లోన్ ఎలా తీసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం...
అప్లయ్ చేయడం ఇలా...
బ్యాంకు, ఎన్బీఎఫ్సీ, ఫిన్‌టెక్ వెబ్సైటు లేదా మొబైల్ యాప్‌లో గోల్డ్‌లోన్ ఎట్ యువర్ డోర్‌స్టెప్ కోసం అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అప్పుడు లోన్ మేనేజర్ డ్యూ డిలిజెన్స్, గోల్డ్ వాల్యుయేషన్ కోసం మీ ఇంటికే వస్తారు. ఆధార్ లేదా పాన్‌కార్డు ఐడెంటిటీ ప్రూఫ్‌గా ఇవ్వాలి. కరెంటు బిల్లు లేదా టెలిఫోన్ బిల్లును అడ్రస్ ప్రూఫ్‌గా ఇవ్వాల్సి ఉంటుంది. గోల్డ్ లోన్ అప్లయ్ చేయడానికి ఒక ఫోటో కూడా ఇవ్వాలి.
ఎంత లోన్ ఇస్తారు...
లోన్ మొత్తం ఎంతనేది బ్యాంకు లేదా ఎన్బీఎఫ్సీని బట్టి మారుతోంది. ఉదాహరణకు ఫెడరల్ బ్యాంకును తీసుకుంటే, ఇంట్లోనుంచే కనీసం రూ. 50 వేల నుంచి, గరిష్టంగా రూ. కోటి దాకా గోల్డ్‌లోన్‌ను తీసుకునే వీలుంది. గోల్డ్ లోన్ టెనర్ కూడా ఒక్కొక్క సంస్థది ఒక్కోలా ఉంటోంది. సాధారణంగా మూడు నుంచి ఆరు నెలల మధ్యలో ఇది ఉండొచ్చు. దేశంలోని పెద్ద సిటీలు అన్నింటిలోనూ డోర్‌స్టెప్ గోల్డ్‌లోన్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. లోన్ తీసుకున్నాక వివరాలు అన్నీ....మీ ఆన్లైన్ అకౌంట్లోనే కనిపిస్తాయి.
గోల్డ్లోన్లపై వడ్డీ ఎంత ...
ఒక్కో సంస్థను బట్టి వడ్డీ రేటు మారుతుంటుంది. రూపీక్లో గోల్డ్లోన్లపై నెలకు 0.49 శాతం (అంటే ఏడాదికి 5.88 శాతం) వడ్డీ ఉంటుంది. నెల నెలా వడ్డీ చెల్లించే వారికే ఈ వడ్డీ రేటును కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఐఐఎఫ్ఎల్ ఏడాదికి 6.48 శాతం నుంచి 27 శాతం దాకా వడ్డీ రేట్లను అమలు చేస్తోంది. లోన్ అమౌంట్, టెనర్, గోల్డ్ ప్యూరిటీల ఆధారంగా వడ్డీ రేట్లు మారుతాయి.
తనఖా బంగారం భద్రత...
బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు తమ వద్ద కుదువ పెట్టిన బంగారాన్ని సెక్యూర్ లాకర్లలో భద్రం చేస్తాయి. ఫిన్‌టెక్ కంపెనీలయితే తమ భాగస్వాములుగా ఉన్న బ్యాంకుల వద్ద లాకర్లలో పెడతాయి.
గోల్డ్ వాల్యుయేషన్ ప్రాసెస్...
మీ ఇంటి దగ్గరే బంగారాన్ని మేనేజర్ తూకం వేస్తారు. అక్కడే ప్యూరిటీ (స్వచ్ఛత) కూడా చెక్ చేస్తారు. బంగారం విలువలో 75 శాతం కంటే ఎక్కువ లోన్లు ఇవ్వకూడదనేది ఆర్బీఐ రూల్. 18 లేదా అంతకంటే ఎక్కువ క్యారెట్ల బంగారాన్ని అప్పుల కోసం అంగీకరిస్తారు. ఒకవేళ ఆభరణాలైతే అందులోని బంగారాన్ని లెక్కించి, దానిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఆభరణాలలో ఉన్న ఇతర మెటల్స్, రాళ్లు, జెమ్స్ వంటి వాటిని మినహాయిస్తారు. డోర్‌స్టెప్ సర్వీసులో గోల్డ్‌లోన్ ప్రాసెస్ అర గంటలోపే పూర్తయి, మీ అకౌంట్లోకి అమౌంట్ వస్తుంది.
