‘రాజా రాజాధి రాజాధి రాజా..’ పాట గుర్తుందా! ఎప్పుడైనా, ఎట్లున్నా, ఏమున్నా లేకున్నా నేనే రాజా అంటూ హీరో చిందేస్తాడు. ఈ పిల్ల చింపాంజీ పోజు కూడా అలాగే లేదు. ఎంచక్కా తల్లికి వీపునాన్చి చేతుల మీద తలపెట్టుకుని దర్జాగా రెస్ట్ తీసుకుంటున్న దీని హొయలు అలాగే ఉన్నాయి మరి. కోనల్నే కోటగా మలిచేసుకుని రాజాలా ఉంటానన్న ధీమా దాని కళ్లల్లో కనిపిస్తోంది కదా. కామెడీ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ అవార్డ్స్‌కు ఎంపికైంది ఈ ఫొటో. పోటీల కోసం 40 ఫొటోలను ఎంపిక చేశారు. టాంజానియాకు చెందిన వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్లు టామ్ సల్లామ్, పాల్ జాయ్న్సన్ హిక్స్ కలిసి ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. వైల్డ్లైఫ్లోని సరదా సంగతులను చూపించడం ఒక్కటే ఈ పోటీల ఉద్దేశం కాదు. అందమైన ఆ అడవి జంతువులను కాపాడుకోవడమూ చాలా ముఖ్యమన్న ఉద్దేశమూ ఆ పోటీల్లో ఉంది. బార్న్ ఫ్రీ ఫౌండేషన్‌తో కలిసి వాళ్లిద్దరూ ఈ పోటీలు నిర్వహిస్తున్నారు.
