రైతుల ఖాతాల్లో రూ.కోటి 83 లక్షలు : కలెక్టర్ కుమార్ దీపక్

నస్పూర్/ఖానాపూర్/జైపూర్, వెలుగు: రైతుల సంక్షేమంలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాలోని కొనుగోళ్ల సెంటర్లలో కొన్న వరి ధాన్యం డబ్బులను రైతుల ఖాతాల్లో వేశామని కలెక్టర్ కుమార్​ దీపక్ తెలిపారు. నస్పూర్ లోని కలెక్టరేట్​లో అడిషనల్ కలెక్టర్ సబావత్ మోతిలాల్ తో కలిసి వివరాలు వెల్లడించారు. జిల్లాలోని 315 కొనుగోలు కేంద్రాల ద్వారా 2 వేల 710 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి సంబంధిత 121 మంది రైతుల ఖాతాల్లో రూ.కోటి 83 లక్షల రూపాయలు జమ చేసినట్లు చెప్పారు. జిల్లాలో 13 రైస్ మిల్లులకు సీఎంఆర్ అనుమతులు ఇచ్చినట్లు చెప్పారు. జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మారావు, వ్యవసాయ అధికారి కల్పన, పౌర సరఫరాల మేనేజర్ శ్రీకళ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

నేషనల్ హైవే నిర్మాణానికి సహకరించాలి

మంచిర్యాల–వరంగల్–ఖమ్మం–విజయవాడ నేషనల్ హైవే 163జి నిర్మాణానికి ప్రజలు సహకరించాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ కోరారు. జైపూర్ మండలం రొమ్మిపూర్​లో ప్రారంభమైన జాతీయ రహదారి పనులను ఆర్డీవో శ్రీనివాసరావుతో కలిసి మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. 334 కిలోమీటర్ల మేర చేపట్టనున్న రహదారి నిర్మాణంలో భూములు కోల్పోయిన వారి జాబితా ప్రకారం నష్టపరిహారం చెల్లించినట్లు చెప్పారు. 

ఆర్బిట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. చెట్లు, బోర్లు, పైప్​లైన్లు, ఇతరత్రా నష్టపోయిన వారు పరిహారం కోసం వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కుందారంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. నిర్వాహకులు నిబంధనలు పాటిస్తూ నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ వనజారెడ్డి, సంబంధిత అధికారులు తదిత రులు పాల్గొన్నారు.  

48 గంటల్లో ఖాతాల్లో డబ్బులు: నిర్మల్ అడిషనల్ కలెక్టర్ 

రైతుల దగ్గర కొనుగోలు చేసిన వరి ధాన్యం డబ్బులను 48 గంటల్లో నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమచేస్తున్నామని నిర్మల్ అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ అన్నారు. మంగళవారం ఖానాపూర్, సత్తనపల్లి, పాత ఎల్లాపూర్ గ్రామాల్లోని వరి కోనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. రైతులు తెచ్చిన ధాన్యాన్ని పరిశీలించారు. ధాన్యాన్ని వెనువెంటనే ఆయా మిల్లర్లకు పంపించాలని నిర్వాహకులకు సూచించారు. కేంద్రాల వద్ద రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అయన వెంట తహసీల్దార్ శివరాజ్, ఖానాపూర్ పీఏసీఎస్ సీఈవో భూమి ఆశన్న తదితరులున్నారు.