మనీలాండరింగ్​ పేరిట రూ.లక్ష దోచేశారు

  • అరెస్ట్ చేస్తామంటూ ముంచిన సైబర్​ క్రిమినల్స్​

హైదరాబాద్,వెలుగు: మనీలాండరింగ్‌ జరిగిందని, ఇంటర్నేషనల్ క్రిమినల్స్‌తో లింకులున్నాయంటూ ఓ సైబర్​ముఠా నగరానికి చెందిన మహిళను బెదిరించి రూ.లక్ష దోచేసింది. మెహిదీపట్నానికి చెందిన ఓ గృహిణికి +91 9226291052 నుంచి ఫోన్​చేసిన దుండగులు తాము ముంబై హైకోర్టు నుంచి మాట్లాడుతున్నామని, మీపై కేసు రిజిష్టర్ అయ్యిందని, వివరాల కోసం మొబైల్లో ‘1’  ప్రెస్‌ చేయాలని చెప్పడంతో అలాగే చేసింది. వెంటనే ముంబయి పోలీసుల పేరుతో మరో వ్యక్తి మాట్లాడాడు. 

ముంబయిలోని ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఆమె పేరుతో అకౌంట్స్​ఉన్నాయని, దాన్నుంచి రూ.25లక్షలు మనీలాండరింగ్ జరిగినట్టు భయపెట్టాడు. తనకు ఎకౌంట్​లేదని చెప్పడంతో కాల్‌ను సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌కు కనెక్ట్ చేస్తున్నానని, అక్కడ కంప్లయింట్​తీసుకుంటారని తెలిపాడు. అక్కడ ఆధార్‌‌ కార్డ్ నంబర్‌‌ తీసుకుని, చెక్​ చేశామని నిజంగానే ముంబయిలో 25 బ్యాంక్ అకౌంట్స్‌ ఉన్నాయని తేలిందని నమ్మించారు. ఈ అకౌంట్స్‌ ద్వారా మనీలాండరింగ్ జరిగిందని చెప్పాడు. వీటిని ఇంటర్నేషనల్ క్రిమినల్స్ ఆపరేట్ చేశారని, ఇస్లాం మాలిక్ అనే క్రిమినల్‌ను అరెస్ట్ చేశామని చెప్పాడు. 

ఇస్లాం మాలిక్‌ నుంచి ఒక్కో అకౌంట్‌కి 15 శాతం కమీషన్ తీసుకున్నట్లు తమ దగ్గర ఆధారాలున్నాయని బెదిరించాడు. ఆమెపై అరెస్ట్ వారెంట్​జారీ అయ్యిందని బెదిరించారు. వెంటనే ముంబయికి విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని చెప్పారు. స్కైప్‌లో డిజిటల్ ఎంక్వైరీకి అటెండ్‌ కావాలని ఆదేశించారు. ఇదంతా యువతి భర్త సహా ఎవరికైనా చెప్తే జైల్లో పెడతామని బెదిరించారు. ఇలా స్కైప్‌ వీడియో కాల్ చేసిన తర్వాత యువతికి సంబంధించిన అన్ని వివరాలు తీసుకున్నారు. స్క్కైప్​ ద్వారా అరెస్ట్ వారెంట్‌, ఐడీ కార్డులు, కోర్టు కాపీలు ఇలా ఫేక్ డాక్యుమెంట్స్‌ వాట్సాప్‌కి పంపించారు. తర్వాత బాధితురాలి నుంచి రూ. లక్ష తీసుకున్నారు. అకౌంట్స్ పరిశీలించిన తర్వాత ఆమెకు ఎలాంటి సంబంధం లేదని తేలితే 15 నిమిషాల్లో డబ్బులు రీ ఫండ్ చేస్తామని నమ్మించారు. తర్వాత ఫోన్లు స్విచ్ఛాప్​చేసుకున్నారు. ఇలా మోసపోయిన బాధితురాలు సిటీ సైబర్‌‌ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.