తలకొండపల్లిలో తహసీల్దార్ పై కిడ్నాప్ కేసు

చేవెళ్ల, వెలుగు : ఓ వ్యక్తి కిడ్నాప్ కేసులో రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి తహసీల్దార్ పై మోకిల పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీలోని భీమవరం జిల్లా చిలుకూరుకు చెందిన శ్రీనివాసరాజుకు రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చంద్రధన గ్రామంలో 50 ఎకరాల భూమి ఉంది. శ్రీనివాస రాజు భూమిపై అదే గ్రామానికి చెందిన అతని ఫ్రెండ్ సూర్యనారాయణ రాజు కన్ను పడింది. 2023 నవంబర్ 15న ఉదయం 7 గంటల  సమయంలో శ్రీనివాసరాజు తన చిన్న కొడుకు రోహిత్ ను శంకర్ పల్లి మండలం కొండకల్ లోని ఇండస్ స్కూల్ లో దింపేందుకు కారులో వెళ్లాడు. 

కొడుకు స్కూల్ లో దింపిన అనంతరం అతడు తన భార్యతో ఫోన్ లో మాట్లాడుకుంటూ కొండకల్ తండా వద్ద కారు( టీఎస్10 ఎఫ్ సీ6688)ను ఆపాడు. ఆ సమయంలో సూర్యనారాయణ రాజుకు సంబంధించిన కొందరు వ్యక్తులు శ్రీనివాస్ రాజు వద్దకు వచ్చి దాడి చేశారు. భార్యతో ఫోన్ లో మాట్లాడుతుండగానే స్విచ్ఛాఫ్ అయింది. ఆయన భార్య సుశీలకు అనుమానం వచ్చింది.  వరుసకు అన్న అయిన సుబ్బరాజుకు విషయం చెప్పింది. వెంటనే అతడు 100కు డయల్ చేసి, మోకిల పీఎస్ కు వెళ్లి కంప్లయింట్ చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 శ్రీనివాసరాజును సూర్యనారాయణ రాజు, రుద్రరాజు బలరామరాజు, తూమటి ఉపేందర్ రెడ్డి, హరికృష్ణ కుమార్, నీలం లక్ష్మీనారాయణ, గోపి కిడ్నాప్ చేసినట్టు గుర్తించి నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. ఎంక్వైరీలో మరో  ఏడుగురు నిందితులు ఉన్నట్టుగా  తేలింది. హైదరాబాద్ కమిషనరేట్ లో పనిచేసే  ఏసీపీ చాంద్ పాషా కూడా  ఉన్నట్టు తేలింది. ఆయనపై కేసు నమోదవగా, హైకోర్టులో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నట్టు తెలిసింది.  కిడ్నాప్ వ్యవహారంలో తలకొండపల్లి తహసీల్దార్ కట్టా వెంకట రంగారెడ్డిపై సైతం కిడ్నాప్ కేసు నమోదు చేశారు.