AUS vs PAK: రెండో టీ20 ఆసీస్‌దే.. రిజ్వాన్ జిడ్డు బ్యాటింగ్‌తో ఓడిన పాకిస్థాన్

ఆస్ట్రేలియా టూర్ లో వన్డే సిరీస్ గెలుచుకున్న పాకిస్థాన్.. టీ20 సిరీస్ లో బోణీ చేయడానికి ఇబ్బందిపడుతుంది. వరుసగా రెండో టీ20 మ్యాచ్ లోనూ ఆసీస్ చేతిలో పరాజయం పాలైంది. మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా శనివారం (నవంబర్ 16) సిడ్నీ వేదికగా జరిగిన రెండో టీ20లో పాకిస్థాన్ పై ఆస్ట్రేలియా 13 పరుగుల స్వల్ప తేడాతో మ్యాచ్ గెలిచింది. దీంతో మ్యాచ్ తో పాటు మరో టీ20 మిగిలి ఉండగానే సిరీస్ ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ ఓటమికి మహమ్మద్ రిజ్వాన్ జిడ్డు బ్యాటింగే కారణమని స్పష్టంగా తెలుస్తుంది. 

టార్గెట్ 148 పరుగులు.. తొలి ఓవర్ లోనే ఆస్ట్రేలియా బౌలర్ ఎక్స్ట్రాల రూపంలో పరుగులు ఇవ్వడంతో 12 పరుగులు వచ్చాయి. ఈ దశలో పాక్ విజయం ఈజీనే అనుకున్నారు. అయితే కెప్టెన్ రిజ్వాన్ మాత్రం నత్త నడకన బ్యాటింగ్ చేశాడు. ఆత్మ రక్షణ ధోరణలో ఆడుతూ పూర్తిగా డిఫెన్స్ కే పరిమితమయ్యాడు. ఆసీస్ ఫాస్ట్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు చేయడానికి తీవ్రంగా శ్రమించాడు. ఈ క్రమంలో 26 బంతుల్లో కేవలం 16 పరుగులే చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్ లో ఒక బౌండరీ మాత్రమే ఉండడం విశేషం. 

పదో ఓవర్ లో రిజ్వాన్ ఔటయ్యే సమయానికి మ్యాచ్ అప్పటికే ఆసీస్ చేతిలోకి వెళ్ళిపోయింది. కొట్టాల్సిన రన్ రేట్ ఎక్కువగా ఉండడంతో పాక్ బ్యాటర్లు ఒత్తిడిని అధిగమించలేకపోయారు. దీంతో ఓ మాదిరి లక్ష్యాన్ని ఆస్ట్రేలియా కాపాడుకోగలిగింది. ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ 134 పరుగులకే ఆలౌట్ అయింది.