SA vs PAK 2024: క్లాసెన్, మిల్లర్‌తో గొడవకు దిగిన రిజ్వాన్

దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ జట్ల మధ్య గురువారం (డిసెంబర్ 19) జరిగిన రెండో వన్డేలో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్యలో వాగ్వాదం జరిగింది. 330 పరుగుల ఛేజింగ్ లో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. హారీస్ రౌఫ్ వేసిన బౌన్సర్ ను ఆడడంలో క్లాసన్ విఫలమయ్యాడు. క్లాసెన్ రౌఫ్‌తో ఏదో మాట్లాడుతుండగా రిజ్వాన్ వచ్చి గొడవను పెద్దది చేశాడు. ఇంతలో అంపైర్ వచ్చి జోక్యం చేసుకొని గొడవను ఆపే ప్రయత్నం చేశాడు. ఈ దశలో రిజ్వాన్.. మిల్లర్, క్లాసన్ వైపు వేలు చూపిస్తూ మాట్లాడాడు. దీనికి బదులుగా మిల్లర్, క్లాసన్ సైతం రిజ్వాన్ పై మాటలతో మండిపడ్డారు. 

ఈ మ్యాచ్ లో క్లాసన్, మిల్లర్ కీలక భాగస్వామ్యం నెలకొల్పినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. ఐదో వికెట్ కు 72 పరుగులు జోడించినా ఫలితం లేకుండా పోయింది. క్లాసన్ 97 పరుగులు చేసి తృటిలో సెంచరీ కోల్పోయాడు. మిల్లర్ 29 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. కేప్ టౌన్ వేదికగా న్యూలాండ్స్ స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో 81 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. దీంతో మూడు మ్యాచ్ ల సిరీస్ లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో పాకిస్థాన్ సిరీస్ సొంతం చేసుకుంది. 

ఈ మ్యాచ్ లో టాస్ ఓడి పాకిస్థాన్ మొదట బ్యాటింగ్ చేసింది. బ్యాటర్లు అందరూ బాధ్యతగా ఆడడంతో 49.5 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌట్ అయింది. మహ్మద్ రిజ్వాన్ 80 పరుగులు చేసి కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. 330 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 248 పరుగులకే ఆలౌట్ అయింది. క్లాసన్ 97 పరుగులు చేసి జట్టు విజయం కోసం తీవ్రంగా పోరాడినా అతడికి సహకరించేవారు కరువయ్యారు.