Pakistan Cricket: పాకిస్థాన్ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా 'రిజ్వాన్'

పాకిస్థాన్ క్రికెట్ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా వికెట్ కీపర్/బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ ఎంపికయ్యాడు. ఆదివారం(అక్టోబర్ 27) మీడియా సమావేశంలో పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఈ విషయాన్ని వెల్లడించారు. అతనికి డిప్యూటీగా సల్మాన్ అలీ ఆఘాను నియమించారు. దాంతో, బాబర్ అజాం స్థానంలో రిజ్వాన్ టీ20, వన్డే జట్లకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. టెస్ట్ జట్టుకు షాన్ మసూద్ నాయకుడిగా కొనసాగనున్నాడు.

రిజ్వాన్‌ను కెప్టెన్‌గా నియమించాలన్న పాక్ ప్రధాన కోచ్ గ్రాంట్ బ్రాడ్‌బర్న్ ప్రతిపాదనను సెలక్షన్ ప్యానెల్ సమర్థించిందని నివేదికలు వెల్లడించాయి. అతని నాయకత్వంలో పాక్ క్రికెట్ పూర్వవైభవాన్ని సాధిస్తుందని ఆ దేశ మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది. వికెట్ల వెనుక చురుగ్గా ఉండే రిజ్వాన్.. భారత మాజీ కెప్టెన్ ధోనీలా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటాడని పేర్కొంది.

కెప్టెన్‌గా దేశవాళీ క్రికెట్‌లో సక్సెస్ 

మహ్మద్ రిజ్వాన్‌కు పాకిస్థాన్ సూపర్ లీగ్ (పిఎస్‌ఎల్), దేశవాళీ టోర్నమెంట్లలో జట్లను నడిపించిన అనుభవం ఉంది. ఈ 32 ఏళ్ల క్రికెటర్ 2021లో పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ముల్తాన్ సుల్తాన్‌ జట్టును విజయపథంలో నడిపించాడు. కెప్టెన్‌గా అతని మొదటి అసైన్‌మెంట్ ఆస్ట్రేలియాతో జరిగే వైట్-బాల్ సిరీస్. వచ్చే నెలలో మెన్ ఇన్ గ్రీన్ వైట్-బాల్ సిరీస్‍ల కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ టూర్‌లో ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు జరగనున్నాయి.