వారి జీవితాలతో ఆడుకోవద్దని ప్రతిపక్షాలపై మోడీ ఫైర్
అగ్రి చట్టాలపై ఆందోళనలను టేకోవర్ చేసిన్రు
కొత్త చట్టాలపై అందరితోనూ మాట్లాడుతం
అయితే వ్యవసాయ సమస్యలు, నిజాలు, లాజిక్ల ప్రాతిపదికగానే చర్చలు
పీఎం కిసాన్ కింద 9 కోట్ల మంది రైతులకు రూ.18 వేల కోట్లు రిలీజ్
న్యూఢిల్లీ: రైతులను పొలిటికల్ పార్టీలు తప్పుదోవ పట్టిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ మండిపడ్డారు. వారి జీవితాలతో ఆడుకోవద్దని, అగ్రి చట్టాలతో రైతులకు లాభమే జరుగుతుందని స్పష్టం చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను టేకోవర్ చేశాయని ఆరోపించారు. ప్రొటెస్టులు మొదలైనప్పుడు ఎంఎస్పీ కొనసాగించాలని డిమాండ్ చేశారని, ఇప్పుడేమో వ్యవసాయ సమస్యలతో సంబంధంలేని వాటిని లేవనెత్తుతున్నారని విమర్శించారు. అగ్రి చట్టాలపై చర్చలు జరిపేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఈ మూడు చట్టాలను తీవ్రంగా వ్యతిరేకించిన వారితో సహా అందరితోనూ మాట్లాడుతామని తెలిపారు. శుక్రవారం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) కింద 9 కోట్ల మంది రైతులకు రూ.18 వేల కోట్లను రిలీజ్ చేశారు. బటన్ నొక్కి రైతుల అకౌంట్లలోకి రూ.2 వేల చొప్పున ట్రాన్స్ఫర్ చేశారు. తర్వాత వర్చువల్‌గా మోడీ మాట్లాడారు. పీఎం కిసాన్ మొదలైనప్పటి నుంచి రూ.1.1 లక్షల కోట్లను రైతుల ఖాతాల్లో వేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 19 వేల వేదికల్లో రైతులు, బీజేపీ లీడర్లు పాల్గొన్నారు.
వ్యవసాయంతో సంబంధంలేని డిమాండ్లా?
‘‘ఆందోళనలు మొదలైనప్పుడు రైతుల డిమాండ్.. కనీస మద్దతు ధర కొనసాగించడం. వాళ్లు రైతులు.. అందుకే వాళ్ల డిమాండ్ న్యాయమైనది.కానీ ఈ నిరసనలను రాజకీయ ఉద్దేశాలు ఉన్న కొందరు టేక్ ఓవర్ చేశారు. ఎంఎస్పీ తదితరాలు పక్కకి పోయాయి.. హింసకు పాల్పడిన వాళ్లను జైళ్ల నుంచి రిలీజ్ చేయాలని, హైవేలను టోల్ ఫ్రీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రైతుల సమస్యల నుంచి అసలు సంబంధం లేని ఈ కొత్త డిమాండ్లకు వాళ్లు ఎందుకు మారిపోయారు?’’ అని ప్రధాని మోడీ ప్రశ్నించారు. ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో అమల్లో ఉన్న అనేక విధానాలను వ్యతిరేకిస్తున్నారని, వాటిని కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు.
రీఫార్మ్స్ అవసరం..
మొత్తం రైతుల్లో 80 శాతం మంది పేదలేనని మోడీ చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలో వాళ్లు మరింత పేదలుగా మారిపోయారని, అందుకే వ్యవసాయ సంస్కరణలు అవసరమని అన్నారు. తాము రైతులను నిరాశపరచబోమని, వారిని ఎంపవర్ చేసేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ‘‘రైతులు ఎక్కువగా ఉన్న ఏరియాల్లో, నిరసనలు జరుగుతున్న ప్రాంతాలకు దగ్గరగా ఉన్న చోట్ల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. మేం తీసుకొచ్చిన చట్టాలను రైతులు సపోర్ట్ చేస్తున్నారనడానికి ఇదే నిదర్శనం’’ అని తెలిపారు. అస్సాం, రాజస్థాన్, జమ్మూకాశ్మీర్ తదితర రాష్ట్రాల్లో ఈ మధ్య ఎన్నికలు జరిగాయని.. రైతులను తప్పుదోవ పట్టించిన పార్టీలను అక్కడ తిరస్కరించారని చెప్పారు.
భూకబ్జాల చరిత్ర తెలుసు
రైతుల భూముల గురించి కొందరు వ్యక్తులు ఆందోళన చెందుతున్నారని, అయితే భూకబ్జాలకు సంబంధించి మీడియాలో ఎవరి పేర్లు బయటికి వచ్చాయో అందరికీ తెలుసని మోడీ ఎగతాళి చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాను ఉద్దేశిస్తూ ఆయన ఈ కామెంట్లు చేశారు. తనపై కొందరు ఆరోపణలు చేయడంపైనా స్పందించారు. ‘‘ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని కొందరు మీతో షేర్ చేసుకోలేని భాషను నాపై వాడారు. అయినా ఇవన్నీ తట్టుకుని కూల్‌గా ఉన్నా. ప్రొటెస్టులు చేస్తున్న వారికి విజ్ఞప్తి చేస్తున్నా.. నిరసనలు తెలుపుతున్న వారితో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆ చర్చలు.. రైతుల సమస్యలు, వాస్తవాలు, లాజిక్‌లపై ఆధారపడి ఉంటాయి” అన్నారు.
అగ్రిమెంట్ ఫార్మింగ్ ముందునుంచే ఉంది..
‘‘అగ్రిమెంట్ ఫార్మింగ్ ఇప్పటికే ఉంది.. డైరీ సెక్టార్ తదితర రంగాల్లో కొనసాగుతోంది. మరి డైరీ ఇండస్ట్రీని ఏదైనా కంపెనీ గుత్తాధిపత్యంలోకి తీసుకోవడం గురించి మీరు ఎక్కైడనా విన్నారా?’’ అని ప్రధాని ప్రశ్నించారు. ‘‘రైతులు తమ పంటను వేరే రాష్ట్రంలో అమ్ముకోవచ్చు. ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ద్వారా సేల్ చేసుకోవచ్చు. బిస్కట్లు, చిప్స్, జ్యామ్ ఇతర కన్జూమన్ వ్యాల్యూ చైన్‌లో భాగం కావచ్చు. మీ పంటను ఎంఎస్పీకి అమ్ముకోవచ్చు. మార్కెట్లో సేల్ చేయొచ్చు. లేదా వ్యాపారులకు అమ్ముకోవచ్చు. ఎక్స్పోర్ట్ కూడా చేయొచ్చు” అని చెప్పారు.
1,000 మండీలను ఆన్లైన్లో కనెక్ట్ చేసినం
వెయ్యికిపైగా మండీలను తమ ప్రభుత్వం ఆన్లైన్లో కనెక్ట్ చేసిందని మోడీ తెలిపారు. వాటిలో రూ.లక్ష కోట్లకు పైగా ట్రేడ్ జరుగుతోందన్నారు. దీంతో గ్రామాల్లోని రైతులకు పంటలు అమ్ముకోవడం ఈజీ అవుతోందని చెప్పారు. ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు చెబుతున్న వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు చేసిందేం లేదన్నారు. తాము ఎంఎస్పీలోకి మరిన్ని పంటలు చేర్చి రైతులకు రికార్డు స్థాయిలో డబ్బు ఇచ్చామని తెలిపారు.
కేరళలో ప్రొటెస్టులు చేయట్లేదేం?
‘‘కేరళలో ఎన్నో ఏళ్లుగా అధికారంలో ఉన్న వాళ్లు.. సెల్ఫీల కోసం, పబ్లిసిటీల కోసం పంజాబ్ రైతులతో కలుస్తున్నారు. కానీ వాళ్లు తమ సొంత రాష్ట్రంలోనే మండీ సిస్టమ్‌కు చేసిందేమీ లేదు. చాలా మంది లీడర్లు తమ సొంత ఐడియాలజీ కోసం నిరసనలను వాడుకుంటున్నారు’’ అని మోడీ మండిపడ్డారు. మరి కేరళలో ప్రొటెస్టులు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.
మమత వల్ల బెంగాల్ నాశనం
పశ్చిమ బెంగాల్‌ను సీఎం మమతా బెనర్జీ నాశనం చేశారని మోడీ మండిపడ్డారు. 70 లక్షల మంది రైతులకు పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులు అందకుండా అడ్డుకున్నార న్నారు. అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా బెంగాల్లో ఆందోళనలు జరుగుతున్నా యని, పీఎం కిసాన్ అమలవకుండా మమత అడ్డుకుంటే ఎవరూ ఆందోళన చేయలేదని అన్నారు. 23 లక్షల మంది బెంగాల్ రైతులు పీఎం కిసాన్ కోసం అప్లై చేశారని, రాష్ట్ర ప్రభుత్వం వెరిఫికేషన్ ప్రాసెస్‌ను చాన్నాళ్లు నిలిపేసిందన్నారు.
గతంలో జైళ్లలో పెట్టి..
‘‘రైతు ఆందోళనలకు ఇప్పుడు కొందరు మద్దతు తెలుపుతున్నారు. కానీ గతంలో వీళ్లే రైతులను జైలులో పెట్టారు. తమ పంటను కాపాడుకునేందుకు రైతులు ఏవైనా అడవి జంతువులను అనుకోకుండా గాయపరిస్తే.. ‘ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్’ పేరుతో అరెస్టు చేశారు’’ అని మోడీ మండిపడ్డారు. ‘‘రైతులు భూములు కోల్పోతారంటూ కొందరు పొలిటీషియన్లు ఏడుస్తున్నారు. గతంలో వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు.. డాక్యుమెంటేషన్ సమస్యలతో రైతులు తమ భూములు కోల్పోయినప్పుడు ఏం చేశారు” అని నిలదీశారు. ఎన్నికల్లో ప్రజలు రిజెక్ట్ చేసిన కొన్ని పార్టీలు.. రైతులను తప్పుదోవ పట్టించడం ద్వారా ప్రొటెస్టుల్లోకి తమ రాజకీయ ఎజెండాను చొప్పిస్తున్నాయని ఆరోపించారు. కొత్త చట్టాలపై వాదించేందుకు వారి వద్ద ఎలాంటి పాయింట్లు లేవని, అందుకే ‘ప్రభుత్వంపై కాల్పులు జరిపేందుకు రైతుల భుజాలపై తుపాకులు పెడుతున్నార’ని మండిపడ్డారు. ఎలక్షన్లలో ఓడిపోయిన ఈ పార్టీలు ఇప్పుడు సెల్ఫీల కోసం ఈవెంట్ మేనేజ్‌మెంట్‌లో పాల్గొంటున్నాయని, ప్రచారం కోసం టీవీల్లో కనిపిస్తున్నాయని ఎగతాళి చేశారు.
దేశవ్యాప్తంగా ఎంతో మంది రైతులు అగ్రి చట్టాలను స్వాగతించారు. తాము పొందిన బెనిఫిట్స్ గురించి నాతో జరిగిన ఇంటరాక్షన్‌లో వివరించారు. రైతులతో నిండు మనసుతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.. కానీ కొందరు తమ రాజకీయ కారణాలతో చర్చలు జరగకుండా చేస్తున్నారు. రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు. మేం తీసుకున్న నిర్ణయంలో ఏవైనా లోపాలు ఉంటే.. ఎత్తిచూపొచ్చు. ఇది ప్రజాస్వామ్యం. దేవుడు మాకు మొత్తం నాలెడ్జ్ ఇచ్చాడని మేం చెప్పడంలేదు.
– ప్రధాని మోడీ
