న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్స్ కంపెనీ మొబిక్విక్ లెండింగ్ వ్యాపారాల్లో బలమైన వృద్ధిని నమోదు చేస్తోంది. తన ప్లాట్‌ఫామ్ ద్వారా 2020 ఆర్థిక సంవత్సరంలో రూ.1,500 కోట్ల విలువైన రుణాలను ఇవ్వాలని టార్గెట్‌గా పెట్టుకుంది. ఫిన్‌టెక్ స్పేస్‌లో పేటీఎం వంటి కంపెనీలకు పోటీఇస్తోన్న మొబిక్విక్, ఈ ఏడాది సెప్టెంబర్‌లో లక్షకు పైగా డిజిటల్ లోన్స్‌ను అందించింది. ‘ఏడాది కిందట మా డిజిటల్ లెండింగ్ జర్నీని ప్రారంభించాం. సెప్టెంబర్‌లో లక్షకు పైగా ఫుల్లీ డిజిటల్ లోన్స్‌ను అందించాం. 2020 ఆర్థిక సంవత్సరంలో రూ.1,500 కోట్ల విలువైన 12 లక్షల రుణాలను ఇవ్వాలనుకుంటున్నాం’ అని మొబిక్విక్ కో ఫౌండర్, సీఈవో బిపిన్ ప్రీత్ సింగ్ చెప్పారు. కస్టమర్లకు అవసరమైన చిన్నమొత్తాల లోన్ ప్రొడక్ట్‌లను ఆఫర్ చేయడానికి ఫైనాన్సియల్ ఇన్‌స్టిట్యూషన్లతో కలిసి కంపెనీ పనిచేస్తోంది. పూర్తిగా డిజిటల్‌గా ప్రాసెస్ చేస్తుండటంతో, ఆపరేటింగ్ కాస్ట్‌లను కూడా తక్కువ ఉండేలా చూస్తున్నామని చెప్పారు. తమ ప్లాట్‌ఫామ్ ద్వారా రెండు వేల నుంచి రెండు లక్షల రూపాయల వరకు రుణాలను అందిస్తున్నట్టు తెలిపారు. 2019 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో రూ.160.5 కోట్లను అందిస్తే.. ప్రస్తుతం నడుస్తోన్న ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో రూ.458.8 కోట్ల రుణాలను జారీ చేసినట్టు బిపిన్ పేర్కొన్నారు. వాల్యు పరంగా చూస్తే.. మూడింతలు వృద్ధిని నమోదు చేస్తున్నట్టు చెప్పారు. లోన్స్ సంఖ్య పరంగా చూస్తే.. నాలిగింతలు వృద్ధిని నమోదు చేసింది మొబిక్విక్. 2019 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో 1.21 లక్షల రుణాలను జారీ చేస్తే.. 2020 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో 4.96 లక్షల రుణాలను అందించింది.

