బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఆశయాలు నెరవేరలే : ఎమ్మెల్సీ ప్రొ.కోదండరామ్​

  • పదేండ్ల పాలనలో అమరుల ఆశయాలు కాలగర్భంలో కలిశాయి
  • కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ. కోట్ల అవినీతి చేశారు
  • టీజేఎస్ అధ్యక్షడు, ఎమ్మెల్సీ  ప్రొ. కోదండరామ్ 

సూర్యాపేట, వెలుగు: ఏ ఆశయ సాధన కోసం తెలంగాణ ఏర్పడిందో ఆ ఆశయాలు పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కాలగర్భంలో కలిశాయని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొ.కోదండరామ్​ అన్నారు. ప్రజా గొంతు నొక్కిన నాటి ప్రభుత్వ బాధ్యులు నేడు రాజకీయంగా బలిదానం అయ్యారని వ్యాఖ్యానించారు. సూర్యాపేటలో శనివారం జరిగిన టీజేఎస్ జిల్లా ప్లీనరీ సమావేశానికి ఆయన ముఖ్య​అతిథిగా హాజరయ్యారు.

తెలంగాణ అమరుల కుటుంబాలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమార్చిందని ఆరోపించారు. అధికారంలో ఉన్నామని పరాన్న జీవుల్లాగా అడ్డగోలుగా అవినీతి, అక్రమాలు చేసి నేడు రాష్ట్రాన్ని అప్పులకుప్పంగా మార్చారని మండి పడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ.కోట్ల అవినీతికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. విద్యుత్ కొనుగోళ్లను సైతం ప్రజలకు అర్థమయ్యేలా చెప్పలేదన్నారు.

ధరణి వల్ల పేదల భూములు అక్రమార్కుల చేతిలోకి వెళ్లాయన్నారు. మార్పు కోసమే టీజేఎస్ స్థాపన జరిగిందని, విలువలను కాపాడుకుంటూ సామాజిక ఉద్యమాలు కొనసాగించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. డబ్బుల్లేని రాజకీయాలే తమ లక్ష్యమని చెప్పారు. కార్యక్రమంలో టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు గట్ల రమా శంకర్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గ ఇన్​చార్జి కుంట్ల ధర్మార్జున్, మొగంపల్లి ఆశప్ప, నాయకులు సర్దార్ వినయ్ కుమార్, నారబోయిన కిరణ్ కుమార్, బొడ్డు శంకర్, బచ్చలికూరి గోపి, వీరేశ్ నాయక్, కృష్ణారెడ్డి, చంద్రకాంత్, వినయ్, తదితరులు పాల్గొన్నారు.

ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ అమలు చేయాలని వినతి 

ఇచ్చిన హామీ ప్రకారం ఎస్సీ, ఎస్టీ  డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు తల్లమల్ల హసేన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సూర్యాపేటకు వచ్చిన ఎమ్మెల్సీ ప్రొ. కోదండరామ్​కు శనివారం ఆయన వినతిపత్రం అందజేశారు.