- 3న ఇందిరాపార్క్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్లు పెంచాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్‌చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచకుంటే.. స్థానిక సంస్థల ఎన్నికలు జరగనివ్వబోమని ఆమె తేల్చి చెప్పారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో చెప్పినట్టుగా 42 శాతం రిజర్వేషన్లను అమలు చేశాకే ఎన్నికలకు వెళ్లాలని, లేకపోతే భారీ స్థాయిలో ఉద్యమిస్తామని ఆమె పేర్కొన్నారు.
బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జనవరి 3న ఇందిరాపార్క్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు తెలిపారు. శుక్రవారం 40కిపైగా బీసీ కులసంఘాల నాయకులతో ఆమె తన నివాసంలో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే.. మండల, జిల్లా కేంద్రాల్లో భారీ నిరసనలు చేపడతామని హెచ్చరించారు.
బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చాక.. బీసీ జనాభాను వెల్లడించిన తర్వాతే ప్రభుత్వం ఎన్నికలపై ముందుకు వెళ్లాలన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసే జనగణనలో కచ్చితంగా కులం అనే కాలమ్‌ను చేర్చాలని, జనాభా లెక్కలతో పాటే కులగణనను చేయాలని ఆమె కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ట్రైలర్ మాత్రమే చూపిస్తున్నామని, జనవరి 3 నుంచి అసలు సినిమా చూపిస్తామని ఆమె చెప్పారు. బీసీల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపేయడం దారుణమని కవిత ఫైర్ అయ్యారు. పేదలకు లబ్ధి చేసే పథకాలను నిలిపేయడం మంచిది కాదన్నారు.