ప్రజలు వెంటపడి మరీ ధరణిని సాధించుకుంటరు

  • భూభారతిపై చర్చలో ఎమ్మెల్సీ కవిత కామెంట్

హైదరాబాద్​సిటీ, వెలుగు: రాష్ట్రంలో ధరణి వచ్చాకే భూముల మోసాలు తగ్గాయని, ఈ పథకం తెలంగాణ రైతులకు రక్షణ కవచంగా నిలిచిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ధరణి స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతిని తెచ్చి ఆటలాడుతోందని మండిపడ్డారు. మండలిలో భూ భారతి బిల్లుపై ఆమె మాట్లాడుతూ.. ప్రజలు వెంటబడి మరీ ధరణిని తిరిగి సాధించుకుంటారన్నారు. భూభారతి ఒక తిరోగమన చర్య అని అన్నారు. భూ భారతి చట్టం భూహారతి అయ్యేటట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. భూ మాత పోర్టల్.. భూ మేతకే దారి తీస్తుందని చెప్పారు.

బీఆర్ఎస్ అంటే భూ రక్షణ సమితి అని రైతులు, ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. ధరణిలో కుట్ర కోణం ఉందని ప్రభుత్వం చెప్పడం దారుణమన్నారు. తెలంగాణలో 2.8 కోట్ల ఎకరాల భూమి ఉండగా, అందులో 1.5 కోట్ల ఎకరాలు సాగు భూమి ఉందని 17.8 లక్షల ఎకరాలు మాత్రమే వివాదాల్లో ఉందని తెలిపారు. రైతులకు భూ భద్రతను కల్పించిన వ్యక్తి కేసీఆర్ అని చెప్పారు. ధరణి కన్నా ముందు చార్మినార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి ఉండేదని, ధరణితో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ భూములను కాపాడిందన్నారు.