వైసీపీకి షాక్... ఎమ్మెల్సీ రాజీనామా..

ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న క్రమంలో అధికార వైసీపీ పార్టీకి అసమ్మతి సెగ గట్టిగానే తగులుతోంది. ఈ ఎన్నికల్లో సీటు ఆశించి భంగపడ్డ నేతలంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలక నేతలు పార్టీకి రాజీనామా చేయగా, తాజాగా మరో ఎమ్మెల్సీ పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

శాసన మండలి ఛైర్మెన్ కు తన రాజీనామా లేఖను పంపిన ఇక్బాల్, వెంటనే ఆమోదించాలని ఛైర్మెన్ ను కోరారు. 2019 ఎన్నికల్లో హిందూపురం నుండి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు ఇక్బాల్. ఈ ఎన్నికల్లో హిందూపురం టికెట్ ఆశించిన ఆయనకు వైసీపీ టికెట్ కేటాయించలేదు. తనను కాదని దీపికాకు టికెట్ కేటాయించటంతో ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక్బాల్ త్వరలోనే టీడీపీలో చేరనున్నారని సమాచారం అందుతోంది.