ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం మానుకోవాలి : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

పాలమూరు, వెలుగు : బీఆర్ఎస్  నేతలు ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను చూసి ఓర్వలేక విషం చిమ్మే ప్రయత్నాలను మానుకోవాలని ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. శుక్రవారం మహబూబ్ నగర్  ప్రభుత్వ జనరల్  ఆసుపత్రిని సందర్శించి చిన్న పిల్లల వార్డులో చికిత్స పొందుతున్న మాగనూరు స్కూల్​ విద్యార్థులను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో కిచెన్, వంట సామగ్రిని పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రెండు రోజుల కింద మాగనూరుకు చెందిన విద్యార్థులు ఫుడ్  పాయిజన్ తో ఆసుపత్రిలో చేరారని, వారికి అందించిన అల్పాహారంలో  పురుగులు వచ్చాయని కొందరు కావాలని ఆసుపత్రికి వచ్చి ఆందోళన చేయడమేమిటని ప్రశ్నించారు. కలెక్టర్, అడిషనల్​ కలెక్టర్, అధికారులు పరుగులు రాలేదని తేల్చారని, ఈ ఘటనపై పూర్తి విచారణ చేస్తామని అధికారుల తప్పిదం ఉంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.  ప్రభుత్వ యంత్రాంగంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

ఆందోళనకర పరిస్థితిలో ఆసుపత్రికి వచ్చిన స్టూడెంట్లకు మెరుగైన వైద్యం అందించారని చెప్పారు. అనంతరం పట్టణంలోని 31వ వార్డు, వీరన్నపేటలో కొత్తగా నిర్మిస్తున్న బైపాస్  రోడ్డు పనులను పరిశీలించారు. కాలనీవాసులకు ఇబ్బంది కలగకుండా బైపాస్  రోడ్డు, అండర్  పాస్  నిర్మించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మున్సిపల్  చైర్మన్  ఆనంద్ గౌడ్, ముడా చైర్మన్  లక్ష్మణ్ యాదవ్, డీసీసీ జనరల్​ సెక్రటరీ సిరాజ్ ఖాద్రీ, కౌన్సిలర్ మోసిన్, ఆసుపత్రి డెవలప్​మెంట్  కమిటీ సభ్యులు బెజ్జుగం రాఘవేంధర్, షాదుల్లా, లైబ్రరీ చైర్మన్  మల్లు నర్సింహారెడ్డి పాల్గొన్నారు.