గురుకులాలకు కొత్త బిల్డింగ్స్​ కట్టిస్తాం : యెన్నం శ్రీనివాస్​రెడ్డి

పాలమూరు, వెలుగు: వచ్చే రెండేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలకు సొంత బిల్డింగులు కట్టిస్తామని పాలమూరు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​రెడ్డి తెలిపారు. గురువారం ఉదయం ఆయన పట్టణంలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మెట్టుగడ్డ ప్రాంతంలోని బాలసదన్ లో రూ.1.35 కోట్లతో కొత్త భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అంబాభవానీ ఆలయంలో భవసాగర్  సంక్షేమ సంఘం కొత్త కమిటీ ప్రమాణ స్వీకారానికి చీఫ్​ గెస్ట్​గా హాజరై వారిని అభినందించారు. సాయంత్రం మున్సిపాల్టీలోని 25వ వార్డులో రూ.45 లక్షలతో, 26వ వార్డులో రూ.8 లక్షలతో, 6వ వార్డులో రూ.20.80 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో అరకొర వసతులతో నడుస్తున్న బాలసదన్​ గురించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి అధునాతన భవన నిర్మాణానికి అనుమతులు తీసుకొచ్చినట్లు తెలిపారు. తల్లిదండ్రుల మాదిరిగా బాల సదన్​లో పిల్లలపై శ్రద్ధ తీసుకుంటామన్నారు. మైనార్టీ కార్పొరేషన్​ చైర్మన్​ ఓబేదుల్లా కొత్వాల్, లైబ్రరీ చైర్మన్  మల్లు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్  లక్ష్మణ్ యాదవ్, మార్కెట్  చైర్మన్  బెక్కెరి అనిత, వైస్  చైర్మన్  పెద్ద విజయ్ కుమార్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి పాల్గొన్నారు.