ఆఫీసర్లు, లీడర్లు టీమ్​గా పని చేస్తేనే టార్గెట్​ను చేరుతాం : యెన్నం శ్రీనివాస్​ రెడ్డి

మహబూబ్​నగర్​ కలెక్టరేట్​/పాలమూరు, వెలుగు : ఆఫీసర్లు, లీడర్లు టీమ్​గా పని చేస్తేనే ప్రభుత్వం నిర్దేశించిన టార్గెట్లను  చేరుకుంటామని మహబూబ్​నగర్​ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్​లో గురువారం మధ్యాహ్నం కలెక్టర్​ విజయేందిర బోయితో కలిసి నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్​ ఇండ్ల నిర్మాణం, పంచాయతీ రాజ్, ఇరిగేషన్, మైన్స్ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం సాయంత్రం  మీడియాతో   మాట్లాడారు.   ప్రజలకు అవినీతి రహిత ప్రజాపాలన అందించడమే సర్కారు లక్ష్యం అన్నారు.

 ఆఫీసర్లు కూడా అందుకు అనుగుణంగా పని చేయాలన్నారు. నియోజకవర్గంలో విద్యాభివృద్ధి కోసం మహబూబ్​నగర్​ విద్యా నిధి స్కీమును తీసుకొచ్చామన్నారు. దీని ద్వారా నిరుపేద విద్యార్థులకు అండగా నిలుస్తామన్నారు. నియోజకవర్గంలో  మదనపల్లితండా, అల్లీపూర్, చౌదరిపల్లి, ఓబులాయపల్లి, కోడూర్, ఫతేపూర్, యారోనిపల్లి, మౌలాలి గుట్ట, యే0నుగొండలో పూర్తి అయి కేటాయింపు కానివి డబుల్​ బెడ్​ రూమ్​ ఇండ్లను అర్హులకు అందించాలని ఆఫీసర్లను ఆదేశించారు. 

 రాబోయే వేసవిలో గ్రామాలు, మున్సిపాలిటీలో నీటి సమస్య ఎదురుకాకుండా చూడాలని మిషన్ భగీరథ ఈ ఈ  దృష్టికి తీసుకొచ్చారు. సాగు నీటి పారుదల శాఖకు సంబంధించి  చెక్ డ్యాంల నిర్మాణం, మంజూరైన వాటి ప్రగతి, చేపట్టాల్సిన పనులపై చర్చించారు. కార్యక్రమాల్లో అడిషనల్​ కలెక్టర్ మోహన్ రావు, ఆయా డిపార్ట్​మెంట్లు ఆఫీసర్లు,  టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ పాల్గొన్నారు.