పేదల సంక్షేమానికే కుటుంబ సర్వే : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

పాలమూరు, వెలుగు: పేదలకు రాజకీయంగా ఆర్థికంగా, సామాజికంగా ప్రయోజనాలు కల్పించేందుకే సోషియో ఎకనామికల్ సర్వే చేస్తున్నామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.  బుధవారం మున్సిపాలిటీలోని ఏనుగొండ 5 వార్డులో  సోషియో ఎకనామికల్ సర్వే ను ఆయన కలెక్టర్ విజయేంద్ర బోయి, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ తో కలిసి  ప్రారంభించారు. 

రెండు రోజుల్లోపే రైతు అకౌంట్లో డబ్బులు

మహబూబ్ నగర్, రూరల్: ధాన్యం కొనుగోలు చేసిన రెండు రోజుల్లోపే రైతులు అకౌంట్లోకి డబ్బులు జమ చేస్తున్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం మహబూబ్ నగర్ రూరల్ మండలంలోని దివిటిపల్లి రైతు వేదిక వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్​ ప్రభుత్వం రైతులకు మద్దతు ధరను కల్పిస్తుందని, సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తుందని దీనిని వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పీయూకి సీఎం సహాయ సహకారాలు 

పాలమూరు యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి సహాయ సహకారాలు ఉన్నాయని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం పాలమూరు యూనివర్సిటీ లో నూతనంగా నిర్మించిన బాలికల హాస్టల్ భవనాన్ని ప్రారంభించి  మాట్లాడారు. అన్ని వసతులతో కూడిన బాలికల హాస్టల్ భవనాన్ని  ప్రారంభించుకోవడం జరిగిందని, భవిష్యత్తు లో వచ్చే కోర్సులను దృష్టిలో ఉంచుకొని ఇంకా కొన్ని హాస్టల్ బ్లాక్ లు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.