దళితుల కోసం పోరాడిన సైనికులను మరువొద్దు : వివేక్ వెంకటస్వామి

ముషీరాబాద్, వెలుగు: బడుగు బలహీన వర్గాల్లో స్ఫూర్తి నింపి.. దళితుల కోసం పోరాడిన యుద్ధ వీరులను మరువొద్దని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సూచించారు. బుధవారం సమతా సైనిక్ దళ్, బీమా కే హీరోస్ ఆధ్వర్యంలో హైదరాబాద్​లో బీమా కోరేగావ్ శౌర్య విజయ్ దివస్ సమతా సైనిక్ దళ్ కవాతు నిర్వహించారు. లోయర్ ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ స్ఫూర్తి భవన్ నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు సాగిన కవాతుకు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చీఫ్​ గెస్ట్​గా హాజరై మాట్లాడారు. చత్రపతి శివాజీ మహరాజ్ నుంచి వారి వంశ రాజుల పాలనలో మహా సైనికులు దేశ రక్షణ కోసం చేసిన సేవలు మరువలేనివన్నారు.

1857లో మొదటి భారత స్వాతంత్య్ర సంగ్రామంలో మహర్ సైనికుల పాత్ర ఎంతో కీలకమని, స్వతంత్ర భారత సైన్యంలో నేటికీ మహర్ రెజిమెంట్ వీరోచిత గాథలు ఘనమైనవిగా చెబుతున్నారని తెలిపారు. సమతా సైనిక దళ్ బాబాసాహెబ్ అంబేద్కర్ మానస పుత్రిక అని, సమాజంలో దురాచారాలను అరికట్టడం సమతా సైనిక్ దళ్ ముందున్న లక్ష్యం అని  పేర్కొన్నారు. ఉత్తమ పౌరులుగా రూపొందించుకోవడం.. చదువు సంస్కారాలకు దగ్గర కావడం.. తేజోవంతమైన బాబాసాహెబ్ మార్గంలో నడవడమే మన ముందున్న మార్గం అని వివేక్​ సూచించారు. ఈ కార్యక్రమంలో అశోక్ ఖానేడే వార్, సురేంద్ర బెలాలే, చంద్రమణి, దాసరి శ్యామ్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.