30 లక్షల మంది మాలల సత్తా చూపిద్దాం: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

  • విభేదాలను పక్కనపెట్టి ఐక్యంగా ముందుకెళ్దాం: వివేక్ వెంకటస్వామి 
  • రిజర్వేషన్లను ఎత్తేసే కుట్ర జరుగుతున్నది.. కులగణన తర్వాతే ఎస్సీ వర్గీకరణపై తేల్చాలని డిమాండ్ 
  • నాగర్ కర్నూల్​లో మాలల ఆత్మీయ సమ్మేళనం, భారీ ర్యాలీ 

నాగర్​కర్నూల్, వెలుగు: మాలలంతా ఐక్యంగా ముందుకెళ్లి, రాజకీయ పార్టీలకు మాలల సత్తా ఏంటో చూపించాలని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ‘‘రాష్ట్రంలో మాలల జనాభా తక్కువగా ఉందన్న ప్రచారం జరుగుతున్నది. కానీ తెలంగాణలో 30 లక్షల మంది మాలలం ఉన్నాం. మనమంతా ఐక్యంగా ఉండి, మన సత్తా ఏంటో అన్ని రాజకీయ పార్టీలకు అర్థమయ్యేలా చేద్దాం” అని పిలుపునిచ్చారు. 

తెలంగాణలో 30 లక్షల మంది మాలలు ఉన్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు సీఎం రేవంత్ రెడ్డికి చెప్పానని తెలిపారు. ఆదివారం నాగర్​కర్నూల్​జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ, మాలల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దీనికి వివేక్​వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పును అడ్డం పెట్టుకుని దళితుల రిజర్వేషన్లను ఎత్తేసే కుట్ర జరుగుతున్నదని అన్నారు. 

కులాల వారీగా జనాభా లెక్కలు లేకుండా.. ఏ వర్గానికి  ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో లెక్క తేలకుండా.. ఎస్సీ వర్గీకరణ అమలు అసాధ్యమని చెప్పారు. కులాల వారీగా లెక్కలు తీయాలన్న రాహుల్​గాంధీ ఆలోచనలను అమలు చేయాలని కోరారు. ‘‘రాష్ట్రంలో మాలల జనాభా తక్కువగా ఉందన్న ప్రచారం జరుగుతున్నది. అది అబద్ధం.. రాష్ట్రంలో 30 లక్షల మంది మాలలు ఉన్నారు. 

కమ్మలు, రెడ్డీలు, ఇతర సామాజిక వర్గాల వాళ్లు సమ్మేళనాలు పెట్టుకుంటే లేని తప్పు.. మాలలు పెట్టుకుంటే వచ్చిందా? మాపై ఎందుకంతా ఈర్ష్య?” అని ప్రశ్నించారు. మాలలంతా విభేదాలను పక్కనపెట్టి ఐక్యంగా ముందుకెళ్లాలని, మాలలంతా ఐక్యంగా ఉన్నారనే సందేశం ఇవ్వాలని పిలుపునిచ్చారు. 

శాస్త్రీయ పద్ధతిలో వర్గీకరణ జరగాలి: ఎమ్మెల్యే వంశీకృష్ణ 

ఉప కులాలకు న్యాయం జరగాలని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. ‘‘18.9 శాతం ఉన్న మన జనాభా ప్రకారం రిజర్వేషన్లు, ఉద్యోగ అవకాశాల కోసం పోరాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. శాస్త్రీయ పద్ధతిలో వర్గీకరణ చేయాలి. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్​రంగంలోనూ రిజర్వేషన్లు కల్పించాలి. కొందరి ఒత్తిడికి తలొగ్గి తొందరపాటు నిర్ణయాలతో అణగారిన వర్గాలకు అన్యాయం చేయాలని చూస్తే సహించేది లేదు” అని హెచ్చరించారు. 

సమ్మేళనంలో దిగంబర్ కాంబ్లే, రాజేంద్రపాల్​గౌతం, మల్లేపల్లి లక్ష్మయ్య, డాక్టర్​చెన్నయ్య తదితరులు పాల్గొని మాట్లాడారు. మాల విద్యార్థులు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు, మేధావులు, కవులు, కళాకారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ఆత్మగౌరవ సభనూ విజయవంతం చేద్దాం.. 

ఇందిరా గాంధీ జమానా నుంచి మాలలు కాంగ్రెస్​కు అనుకూలంగా ఉన్నారన్న విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లానని వివేక్ వెంకటస్వామి తెలిపారు. ‘‘మాలలు ఓటేస్తే గెలుస్తామన్న విశ్వాసం కల్పించిన ఘనత మన జాతికే దక్కుతుంది. మన జాతిపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టడానికి నేను ముందుకొచ్చాను. మన నాయకులను మనమే కాపాడుకోవాలి. 

వాళ్లను గెలిపించుకుంటే మనకు సేవ చేస్తారు. కాకా వెంకటస్వామి నిరుపేద దళితులకు 75 వేల గుడిసెలు ఇప్పించినప్పుడు వారిలో ఉపకులాలను చూడలేదు. నలుగురు మాదిగలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చినప్పుడు మాలలు ఏనాడూ విమర్శించలేదు. కారంచేడు, చుండూరు వంటి అమానవీయ సంఘటనలు జరిగినప్పుడు మాల మేధావులు పోరాడారు. వారి పోరాటం వల్లే న్యాయం జరిగింది” అని గుర్తు చేశారు. 

ఎదుటివారిని విమర్శించడం సరికాదని, అర్థవంతమైన విమర్శలు చేయాలని సూచించారు. ‘‘మాలల త్యాగం, ధైర్యం, సత్తా ఏమిటో చాటాల్సిన సమయం వచ్చింది. ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున మాలలు ఏకమవుతారని నేను ఊహించలేదు. ఇదే స్ఫూర్తి, పట్టుదలతో నవంబర్​24న హైదరాబాద్​లో నిర్వహించే మాలల ఆత్మగౌరవ సభకు భారీగా తరలిరావాలి” అని పిలుపునిచ్చారు.