అమిత్ షా.. రాజీనామా చేయాలి : ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి

  • దళితులంటే ఆయనకు చిన్నచూపు
  • అందుకే వారి మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడ్తున్నడు
  • కామెంట్లను వెంటనే వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలన్న ఎమ్మెల్యే
  • ట్యాంక్​బండ్​ వద్ద అంబేద్కర్​ విగ్రహానికి పాలాభిషేకం

ముషీరాబాద్, వెలుగు: పార్లమెంట్​లో అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని దళితులకు క్షమాపణ చెప్పాలని, పదవికి రాజీనామా చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. దళితుల మీద కక్షతోనే అమిత్​ షా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, దళితులంటే ఆయనకు చిన్నచూపు అని మండిపడ్డారు. అంబేద్కర్​పై అమిత్​ షా చేసిన కామెంట్స్​కు నిరసనగా గురువారం ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి వివేక్​ వెంకటస్వామి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘అమిత్​షా  మాటలను చూస్తుంటే ఆయనకు దళిత కులాల మీద వివక్ష కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. వివక్ష పోవాలనే అంబేద్కర్ పోరాటం చేసి ఆత్మగౌరవం కల్పించారు. అలాంటి అంబేద్కర్ పై అమిత్​ షా ఇష్టమున్నట్లు మాట్లాడడం ఏమిటి? వెంటనే పదవికి రాజీనామా చేయాలి” అని డిమాండ్​ చేశారు. అభివృద్ధికి దూరంగా ఉన్న దళితులను ఎలా అభివృద్ధి చేయాలి.. ఎలా ప్రోత్సహించాలి అనే ఆలోచన చేయకుండా, మనోభావాలు దెబ్బతీసే విధంగా అమిత్​ షా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాఖ్యలను  వెనక్కి తీసుకొని.. బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు.