మాలలంతా ఐక్యంగా ముందుకు సాగాలి..డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో జరిగే సభకు భారీగా తరలిరావాలి : వివేక్ వెంకటస్వామి

  • రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మాలలు, మాల ఉద్యోగస్తుల ఆత్మీయ సమ్మేళనం
  • నాగార్జున సాగర్ రహదారిపై భారీ ర్యాలీ

ఇబ్రహీంపట్నం, వెలుగు : రాష్ట్రంలోని మాలలు ఐక్యంగా ముందుకు సాగాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. శనివారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన మాలలు, మాల ఉద్యోగస్తుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం చౌరస్తాలో మాల ఉద్యోగస్తులు, నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన తర్వాత నాగార్జున సాగర్ రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఓ గార్డెన్స్‌‌‌‌లో నిర్వహించిన సమ్మేళనంలో వివేక్ మాట్లాడుతూ.. మాలల సంఖ్య చాలా తక్కువ అని అనుకుంటున్న వారికి మనమంతా ఐక్యంగా ఉండి మన సంఖ్య ఎంతుందో చూపించాలన్నారు. మాలలకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వకపోతే ఏ రాజకీయ పార్టీకైనా భవిష్యత్ ఉండదన్నారు. ఇందిరా గాంధీ సమయం నుంచి మాలలు కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారని, అందుకే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. ఇది మాలలకు తగిన ప్రాధాన్యం ఇవ్వని పార్టీలకు హెచ్చరికలాంటిదన్నారు.

మాలలంతా ఈగోను పక్కనబెట్టి, ఐక్యంగా ఉన్నామని చాటాలన్నారు. అలా చేయాలంటే కొన్ని త్యాగాలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మనం మన సత్తా చూపించాలంటే డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో హైదరాబద్‌‌‌‌లో నిర్వహించే మాలల సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కుల వ్యవస్థ నిర్మూలన కోసమే బీఆర్‌‌‌‌‌‌‌‌ అంబేద్కర్‌‌‌‌‌‌‌‌ రిజర్వేషన్లను తీసుకొచ్చారని, వెనుకబాటుతనం కోసం కాదన్నారు. బుద్ధవనం ఓఎస్డీ మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ అనేది కుట్ర అని, ఈ సమయంలో మాలలందరూ కలిసి నడవాలన్నారు.

ఈ కార్యక్రమంలో బుద్ధవనం ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ గోపినాథ్‌‌‌‌, సమత సైనిక్ దళ్‌‌‌‌ జాతీయ ప్రధాన కార్యదర్శి దిగంబర్ కాంబ్లీ, ప్రముఖ గాయకుడు రేంజర్ల రాజేశ్‌‌‌‌, హంస అధ్యక్షుడు సర్వయ్య, మాల కులాల ఐక్య వేదిక కన్వీనర్ మారయ్య, ఈడీ సర్వయ్య, ఈగల రాములు, కిష్టయ్య, శివకుమార్, అబ్బయ్య, శ్రవణ్ కుమార్, నాయకులు అంగద్ కుమార్, కృష్ణ, రఘుకుమార్, జగన్ తదితరులు పాల్గొన్నారు.​

కులగణన సర్వేలోనేతాని పేరు నేతకానిగా మార్పు

  • ఎమ్మెల్యే వివేక్​కు నేతకాని మహర్ విద్యావంతుల వేదిక కృతజ్ఞతలు

హైదరాబాద్, వెలుగు : కులగణన సర్వే​లో ‘నేతకాని’ బదులు ‘నేతాని’ అని పేర్కొన్న తప్పును చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చొరవతో రాష్ట్ర ప్రభుత్వం సరిదిద్దింది. దీంతో ఎస్సీ వర్గంలో సీరియల్ నంబర్ 40లో నేతకాని పేరు స్పష్టంగా వచ్చేలా కృషి చేసిన వివేక్​కు నేతకాని మహర్ విద్యావంతుల వేదిక కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ మేరకు శనివారం వివేక్​ను కలిసిన నేతకాని మహర్ విద్యావంతుల వేదిక కన్వీనర్ మసాదే లక్ష్మీనారాయణ, కో కన్వీనర్ దుర్గం నరేశ్ తదితరులు ధన్యవాదాలు తెలిపారు. నేతకాని మహర్ కులస్తులను ఎస్సీ-ఏ కేటగిరీలో చేర్చేందుకు చొరవ చూపాలని వివేక్​ను కోరారు.

నేతకాని మహర్​లకు ప్రత్యేకంగా ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు కృషిచేయాలని అడిగారు. హైదరాబాద్ లో నేతకాని మహర్ ఆత్మగౌరవ భవనం కోసం ప్రభుత్వం 5 ఎకరాల స్థలం కేటాయించేలా సహకరించాలన్నారు. తర్వాత వాళ్లు మాట్లాడుతూ గోదావరి పరివాహక జిల్లాల్లో నేతకాని మహర్ కులస్తులు పెద్దసంఖ్యలో ఉన్నారని, కానీ ఇంతవరకు రాజ్యాంగ ఫలాలు అందక వారంతా వెనకబడ్డారన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేయడానికి సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో నేతకాని మహర్​లు తమ డిమాండ్లను, విన్నపాలను ప్రభుత్వం నియమించిన కేబినెట్ సబ్​కమిటీకి పంపించాలని పిలుపునిచ్చారు.