కుట్రలనుతిప్పికొడ్దాం..ఐక్యంగా పోరాడి హక్కులు సాధించుకుందాం : వివేక్​ వెంకటస్వామి

  • మాలల సింహగర్జన సభలో ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి
  • రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు కుట్రలు చేస్తున్నరు
  • రాష్ట్రంలో మాలలు తక్కువగా ఉన్నట్లు దుష్ప్రచారం చేస్తున్నరు
  • ఐక్యతను చాటి చెప్పాల్సిన సమయం ఇది
  • ఎస్సీలకు 20 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి 
  • నేను కాంగ్రెస్​ పార్టీ, రాహుల్​ నిర్ణయాలకు వ్యతిరేకం కాదు
  • జాతి ఆత్మగౌరవం కోసం పోరాడటం తప్పా?
  • నాడు కక్షగట్టి ఈడీ, ఐటీ దాడులు చేసినా భయపడలేదని వెల్లడి

హైదరాబాద్, వెలుగు : ఎస్సీలకు  20 శాతం రిజర్వేషన్లు కల్పించాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. కాంగ్రెస్​ పార్టీకి, రాహుల్ గాంధీ నిర్ణయానికి వ్యతిరేకంగా తాను మాట్లాడటం లేదని, రాహుల్ గాంధీ కూడా  రిజర్వేషన్లపై ఇలాగే అన్నారని ఆయన గుర్తుచేశారు. ‘‘మా జాతి కోసం, హక్కుల కోసం పోరాడుతుంటే నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కొంత మంది కోరుతున్నరు. ఆత్మగౌరవం కోసం పోరాడటం తప్పా? నేను ఎవరికీ వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. మాలల రిజర్వేషన్లను ఎత్తేసే కుట్ర జరుగుతున్నది” అని అన్నారు. ఆదివారం సికింద్రాబాద్​లోని పరేడ్ గ్రౌండ్​లో జరిగిన మాలల సింహగర్జన సభలో వివేక్​ వెంకటస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 

మాలల ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా లక్షలాదిగా తరలివచ్చారని, మాలల మీటింగ్ అంటే ఎంతో మంది హేళన చేశారని, వారందరికీ ఈ సభకు అశేషంగా తరలొచ్చిన జనమే చెంపపెట్టు అని పేర్కొన్నారు. ఖమ్మం, అదిలాబాద్, భద్రాచలం వంటి దూర ప్రాంతాల నుంచి కూడా ఎందరో తరలివచ్చారని.. ఐక్యతను చాటి చెప్పారని ప్రశంసించారు. ఈ సభ ద్వారా మాలల సత్తా చాటామన్నారు. మాలలపై జరుగుతున్న కుట్రలను తిప్పికొడ్దామని ఆయన పిలుపునిచ్చారు.  

అంబేద్కర్​ను విమర్శిస్తే ఊరుకోం

మాల కులంపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వివేక్​ వెంకటస్వామి మండిపడ్డారు. ‘‘ప్రజలకు న్యాయం చేసిన గొప్ప వ్యక్తి, దళితులకు దేవుడు బాబా సాహెబ్​ అంబేద్కర్​. అంబేద్కర్ ను విమర్శిస్తే మాలలు ఊరుకోరు. మాలలకు దేవుడాయన. పదవులు, నిధుల్లో దళితులకు ఫ్రీడం ఉండాలని పోరాటం చేశారు. ప్రపంచంలోనే దళితుల కోసం ముందుండి కొట్లాడిన మహానుభావుడు అంబేద్కర్​. పేదలకు, మహిళలకు రక్షణ కల్పించారు. 

ఆయన గురించి ఎవరైనా తక్కువగా మాట్లాడితే సహించేది లేదు” అని హెచ్చరించారు. అంబేద్కర్, రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను క్రీమీలేయర్ పేరుతో ఎత్తివేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణపై కుట్రతో జడ్జిమెంట్​ ఇచ్చారని.. ఆ తీర్పును వ్యతిరేకించాలని ఆయన అన్నారు. 

మాలలపై చిన్నచూపును సహించం

మాలలంతా ఐక్యంగా ఉండాలని.. ఆత్మగౌరవం కోసం పోరాటం చేయాలని వివేక్​ వెంకటస్వామి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మాలలు తక్కువగా ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నవారికి ఈ సభకు వచ్చిన జనమే చెంపదెబ్బ అని పేర్కొన్నారు.  ‘‘అన్ని పార్టీల్లో మాలలపై చిన్న చూపు ఉంది.   రాష్ట్రంలో మాలలు తక్కువగా ఉన్నట్లు ప్రచారం చేస్తున్నరు. అలాంటి వారు వాస్తవాలు తెలుసుకోవాలి. 

రాష్ట్రంలో మాలలు 30 లక్షల మంది ఉన్నారు. ఎక్కువ మంది జనాభా ఉన్న రెండో అతిపెద్ద క్యాస్ట్ మాల” అని వివరించారు.  ఆత్మగౌరవం కోసం పోరాటం చేయాలని, మాలల సంఖ్య ఇంత పెద్దగా ఉందని స్ట్రాంగ్ మెసేజ్​ను ఈ సభ ద్వారా పంపిస్తున్నామని తెలిపారు. 

నా మీద విమర్శలు చేస్తున్నరు

పదవుల కోసమే మాలల తరఫున పోరాటం చేస్తున్నట్లు తనపై కొందరు ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని వివేక్​ వెంకటస్వామి మండిపడ్డారు. తన జాతి ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తుంటే దాన్ని విమర్శించడం ఏమిటని నిలదీశారు. ‘‘నేను మాలల ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్న. తెలంగాణ కోసం కూడా పోరాడిన. నాపై కక్షపూరితంగా ఈడీ, ఐటీ దాడులు జరిగినా వెనక్కి తగ్గలేదు. తెలంగాణ వచ్చాక  కేసీఆర్  చేపట్టిన ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమించిన. అప్పుడు కూడా ఈడీ దాడులు జరిగాయి. ఎన్నో పదవులు ఆఫర్ చేశారు. అయినా నేను తీసుకోలేదు. పదవుల కోసం ఆశపడే నైజం నాది కాదు. 

మాలల జాతి ఆత్మగౌరవం కోసమే నా ప్రయత్నం.. నా పోరాటం. మాల సంఘాలు చాలా ఉన్నాయి..  అందరం ఐక్యంగా ఉన్నప్పుడే మన హక్కులు కోసం పోరాడవచ్చు” అని తెలిపారు. మాలలపై తప్పుడు ప్రచారాన్ని సహించబోమని.. మాలలు ఎవరినీ దోచుకోలేదని ఆయన అన్నారు. ‘‘నార్త్ లో ఎప్పుడూ ఇన్ని గంటలు మీటింగ్ జరగలేదని ఢిల్లీ ఆప్​ మాజీ మంత్రి రాజేందర్ పాల్ గౌతమ్ అంటున్నరు. ఖమ్మం, ఆదిలాబాద్, భద్రాచలం వంటి దూర ప్రాంతాల నుంచి ఎన్నో గంటలు జర్నీ చేసి మీటింగ్ కు చాలా మంది వచ్చారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వక కృతజ్ఞతలు” అని తెలిపారు.

దళితుల కోసం కాకా పోరాటం 

కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి దళితుల కోసం పోరాటం చేశారని.. మాల , మాదిగ అని తేడాలు చూడలేదని వివేక్  వెంకటస్వామి అన్నారు. అంబేద్కర్ విద్యా సంస్థల్లో కూడా మాల, మాదిగలు ఉన్నారని.. ఇందులో 2లక్షల మంది చదవుతున్నారని ఆయన గుర్తుచేశారు.  కాకా వెంకటస్వామి హైదరాబాద్​లో 75 వేల మందికి గుడిసెలు ఇప్పించారని, 40 వేల మందికి ఉద్యోగాలు ఇప్పించారని తెలిపారు. ‘‘పరేడ్ గ్రౌండ్డ్​ మీటింగ్  సక్సెస్​ అవుతుందా అని నన్ను ఎంతో మంది అడిగారు. జిల్లాల్లో మీటింగ్ పెట్టినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది. 

మాలల సత్తా చూపిస్తామని అప్పుడే ప్రకటించిన. ఇప్పుడు విజయవంతం చేశారు”  అని వివేక్​ పేర్కొన్నారు. ‘‘3 వేల ఏండ్ల నుంచి కుల వివక్ష ఉంది.  దళితులకు ఫ్రీడమ్ రావాలని అంబేద్కర్ మాట్లాడారు. కుల వివక్ష వల్లే రిజర్వేషన్లను అంబేద్కర్ తీసుకొచ్చారు” అని తెలిపారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదని.. దళితులను విభజించాలని చూస్తే సహించబోమన్నారు.

ఐక్యంగా ఉందాం : కేఆర్ నాగరాజు

కాకా వెంకటస్వామి అన్ని కులాలను దగ్గరకు తీసుకున్నారని,  హైదరాబాద్ లో అందరిని ఆదరించి, గుడిసెలు ఇచ్చి గుడిసెల వెంకటస్వామిగా పేరొందారని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. కాకా కుమారుడు వివేక్ వెంకటస్వామి దగ్గరకు కూడా అన్ని కుల, మత సంఘాల నేతలు వెళ్తున్నారని.. ఆయన కూడా అందరినీ ఆదుకుంటున్నారని చెప్పారు. ఇప్పుడు  జాతి కోసం వివేక్ ఎంతో కష్టపడుతున్నారని, అందరం ఐక్యంగా ఉండి ఆయనకు అండగా నిలుద్దామని నాగరాజు పిలుపునిచ్చారు. 

రాజ్యాధికారంతోనే సమస్యల పరిష్కారం : మేడిపల్లి సత్యం 

‘‘సంఖ్యాబలం ఒక్కటే కాదు.. చదువు, ఉద్యోగాల్లో కూడా ఎక్కువ మంది ఎస్సీలు ఉంటేనే ఆత్మగౌరవం ఉన్నట్టు అని అంబేద్కర్ చెప్పారు. ఏ ఉద్యమం వచ్చినా మాలలు ముందు వరుసలో ఉంటారు. ఒక్క శాతం కూడా లేని వాళ్లు రాజ్యాధికారం సాధించారు. మనం ఎందుకు రాజ్యాధికారం కోసం పోరాడవద్దు? రాజ్యాధికారంతోనే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది” అని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. 

మాలలను విడగొట్టే కుట్ర : వినోద్  

మాలలపై కుట్రలు చేస్తున్నారని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ మండిపడ్డారు. ‘‘దేశంలో 140 కోట్ల జనాభా ఉంటే, 30 కోట్ల మంది మాలలు ఉన్నారు. కానీ తక్కువ మంది మాలలు ఉంటే, ఎక్కువ లాభం జరుగుతున్నదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ ఈ మీటింగ్ చూడాలి” అని అన్నారు. ప్రజలకు సేవ చేయాలని తమ తండ్రి వెంకటస్వామి ఆశీర్వాదంతో తాను, తన తమ్ముడు వివేక్ ముందుకు వెళ్తున్నామని చెప్పారు.

మాలమాదిగలు ఐక్యంగా ఉండాలి : మల్లు రవి 

రిజర్వేషన్లు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని ఎంపీ మల్లు రవి అన్నారు. మాల మాదిగల మధ్య విభేదాలు రాకుండా చూడాలన్నదే ఈ మీటింగ్ ఉద్దేశమని చెప్పారు. అందరూ కలసికట్టుగా ఐక్యంగా ఉండాలని సూచించారు. ప్రైవేట్ సెక్టార్ లో కూడా రిజర్వేషన్లు ఉండాలని అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పుపై మాల మాదిగలు కలిసి పోరాటం చేయాలని సూచించారు.  

ఆత్మగౌరవం కోసమే : శంకర్ రావు

బీఆర్ అంబేద్కర్ తర్వాత దళితుల కోసం కృషి చేసిన వ్యక్తి కాకా వెంకటస్వామి అని మాజీ మంత్రి శంకర్ రావు అన్నారు. అంబేద్కర్ విద్యాసంస్థలు ఏర్పాటు చేసి ఎంతో మంది పేదలు చదువుకునేలా చేశారని గుర్తు చేశారు. ఈ మీటింగ్ ఎవరికీ వ్యతిరేకం కాదని, మాలల ఆత్మగౌరవం కోసమే ఏర్పాటు చేశామన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు మాలలకు వ్యతిరేకంగా ఉందన్నారు. రాష్ట్రంలో 30 లక్షల మంది మాలలు ఉన్నారని చెప్పారు. 

మాలల కోసం పోరాడ్త : విజయ రామారావు 

తాను ఏ పార్టీలో ఉన్నా మాలల కోసం పోరాడతానని మాజీ మంత్రి విజయ రామారావు అన్నారు. ‘‘ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు బాధాకరం. అయితే ఇది తమ సలహా మాత్రమేనని, అమలు చేసే అధికారం రాష్ట్రాలకే అప్పగిస్తున్నామని తీర్పులో జడ్జిలు పేర్కొన్నారు. ఈ తీర్పును పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంది. అన్ని రాష్ట్రాలు అంగీకరించాల్సి ఉంది” అని తెలిపారు. 

మంద కృష్ణ బెదిరింపులకు భయపడం : మహాసేన రాజేశ్  

మంద కృష్ణ బెదిరింపులకు భయపడబోమని ఏపీ నేత మహాసేన రాజేశ్ అన్నారు. ఈ సింహగర్జన సభను చూసి మంద కృష్ణకు భయం పట్టుకున్నదని చెప్పారు. ‘‘మంద కృష్ణ లాంటోళ్లను తొక్కుకుంటూ ముందుకెళ్తం. ఆయనకు పార్టీల మద్దతు ఉంటే, మాకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అండగా ఉంది” అని అన్నారు. సింహగర్జన సభను విజయవంతం చేసిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.   

ఎస్సీ వర్గీకరణపై పార్లమెంట్​లో చర్చ జరగాలి : పాశ్వాన్ 

ఎస్సీ వర్గీకరణపై పార్లమెంట్ లో చర్చించాలని అంబేద్కర్ రాష్ట్రీయ ఏక్తా మంచ్ నేషనల్ ప్రెసిడెంట్ భవన్​నాథ్ పాశ్వాన్ డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మాలలు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మాలలు పోరాడితే మోదీ కుర్చీ కదులుతుందన్నారు. మొదటిసారి ఇంతమంది మాలలు ఒకేచోట చేరడం అభినందనీయమన్నారు. ఈ మీటింగ్ కు వచ్చినట్టు ఢిల్లీకి కూడా రావాలని, తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

దేశంలోని మాలలందరినీ ఏకం చేస్తం : రెంజర్ల రాజేశ్ 

రాష్ట్రంలో మాలలు కొంతమందే ఉన్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రముఖ సింగర్ రెంజర్ల రాజేశ్ మండిపడ్డారు. ‘‘15 రోజుల ముందు చెబితేనే సభకు ఇంతమంది వచ్చారు. దేశంలో ఉన్న మాలలందరినీ ఏకం చేస్తాం. 30 ఏండ్ల అబద్ధాలకు గోరి కట్టడానికి ఈ తరం రెడీగా ఉంది” అని అన్నారు.