భారత్ గొప్ప నాయకున్ని కోల్పోయింది: ఎమ్మెల్యే వివేక్

హైదరాబాద్: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు అని కాంగ్రెస్ నేత, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ అన్నారు. మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఎమ్మెల్యే వివేక్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత దేశం ఒక మంచి నాయకుని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ ఆర్థిక కష్టాలలో ఉన్న సమయంలో సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్‎గా బాధ్యతలు చేపట్టి కొత్త  ఆర్థిక విధానాలతో మన దేశ రూపాన్ని మార్చేశారని కొనియాడారు. 

మన్మోహన్ హయాంలో దేశ ఆర్థిక వృద్ధి రేట్ కొత్తపుంతలు తొక్కిందని.. ప్రపంచ దేశాలలో జీడీపీ 4 శాతం ఉంటే.. భారత ఆర్థిక వృద్ధి రేట్ 9శాతం ఉందని తెలిపారు. మన్మోహన్ హయాంలోనే రైట్ టూ ఎడ్యుకేషన్, రైట్ టూ ఫుడ్ , రైట్ టూ వర్క్ వంటి కొత్త  పథకాలు అమలు చేశారని పేర్కొన్నారు. మా నాన్న కాకా వెంకట్ స్వామి, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మంచి సన్నిహితులని చెప్పారు.

రూరల్ డెవలప్మెంట్‎కు నిధులు పెంచాలని మా నాన్న ఎంపీగా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్‎ను విజ్ఞప్తి చేస్తే వెంటనే రూ.25 వేల కోట్ల బడ్జెట్ పెంచారని గుర్తు చేశారు. అప్పట్లో నా విజ్ఞప్తి మేరకు రామగుండం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ  రీ ఓపెన్ కోసం రూ.10 వేల కోట్ల రుణాన్ని మాఫీ చేసి.. ఎరువుల కర్మాగారం పున: ప్రారంభానికి సహకరించారని తెలిపారు. 

మన్మోహన్ హయాంలో చాలా స్కాం‎లు జరిగాయని ప్రతిపక్షాలు ఎన్నో ఆరోపణలు చేసినా... ఏవి నిరూపించబడలేదన్నారు. మన్మోహన్ హయాంలోనే విదేశీ మారక నిలువలు గణనీయంగా పెరిగాయని చెప్పారు. మన్మోహన్ సింగ్ దేశ అభివృద్ధికి ఏమికావాలో తెలిసిన ప్రధాని అని కొనియాడారు. మన్మోహన్ సింగ్ సేవలను, ఆయనను ఈ దేశ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారన్నారు.