పెబ్బేరు మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తా : వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి

పెబ్బేరు, వెలుగు: పెబ్బేరు సంత స్థలానికి కాంపౌండ్ ఏర్పాటు చేయిస్తానని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు.  మంగళవారం పెబ్బేరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.  నూతన కమిటీ సభ్యులను సన్మానించి  అభినందనలు తెలిపారు.  ఎమ్మెల్యే మాట్లాడుతూ..  44వ నెంబర్ జాతీయ రహదారి పై ఉన్న  పెబ్బేరు మార్కెట్ యార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు.

నూతనంగా ఎన్నికైన మార్కెట్ కమిటీ సభ్యులందరు మార్కెట్ అభివృద్ధి కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. కోట్ల విలువ చేసే పెబ్బేరు సంత స్థలం కబ్జాకు గురైందని తాను కాపలదారుడిగా 30 ఎకరాల 22 కుంటలకు దగ్గరుండి కంపౌండ్ వాల్ ఏర్పాటు చేయిస్తానని హామీనిచ్చారు.  రానున్న గాంధీ జయంతి నుంచి రాష్ట్రంలోని ప్రజలందరికీ డిజిటల్ రేషన్ కార్డులు అందజేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ డిజిటల్  రేషన్ కార్డు లో ఆరోగ్యశ్రీ కార్డు సైతం ఉంటుందని ఆయన వివరించారు.

 కార్యక్రమంలో  వ్యవసాయ మార్కెట్ యార్డు  చైర్‌‌‌‌పర్సన్  గౌని ప్రమోదిని రెడ్డి, ఉపాధ్యక్షులు విజయవర్ధన్ రెడ్డి తో పాటు నూతన  కమిటీ సభ్యులు, వనపర్తి మార్కెట్ యార్డు చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, పెబ్బేరు మున్సిపల్ చైర్ పర్సన్ కరుణశ్రీ,  పాలక వర్గ సభ్యులు, కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు  పాల్గొన్నారు.