విద్య, వైద్యానికే ప్రాధన్యత ఇస్తాం : చిక్కుడు వంశీకృష్ణ

ఉప్పునుంతల, వెలుగు: విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి అచ్చంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎంపీపీ తిప్పర్తి అరుణ నర్సింహారెడ్డి అధ్యక్షతన బుధవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి ఎంపీ రాములు, ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లోని సమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఆఫీసర్లు బాధ్యతాయుతంగా పని చేస్తూ గ్రామాల్లో సర్పంచులు లేని లోటు కనిపించకుండా చేయాలన్నారు.

కాంగ్రెస్  ప్రభుత్వం రైతులకు 24 గంటల కరెంట్  ఇస్తున్నప్పటికీ బీఆర్ఎస్  నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఏదైనా సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించి నిరంతరాయంగా కరెంట్​ అందించాలని సూచించారు. ఎంపీ రాములు మాట్లాడుతూ సమిష్టి కృషితోనే గ్రామాల్లో అభివృద్ధి సాధ్యమవతుందని, ఆ దిశగా అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి పని చేయాలని సూచించారు. సమావేశానికి గైర్హాజరైన అధికారులకు మెమో జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. జడ్పీటీసీ అనంత ప్రతాపరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్  సత్తు భూపాల్ రావు, ఎంపీడీవో లక్ష్మణరావు, తహసీల్దార్  శ్రీకాంత్  పాల్గొన్నారు.