తనది ఐరన్ లెగ్ కాదని.. గోల్డెన్ లెగ్ అని టీడీపీ నాయకులు ఇప్పటికైనా తెలుసుకోవాలని అన్నారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా. తన మీద ఐరన్ లెగ్ ముద్ర వేసి వైఎస్ జగన్ నుంచి తనను దూరం చేయడానికి టీడీపీ నాయకులు చాలా కుట్రలు చేశారని ఆరోపించారు. తిరుగులేని ఆధిక్యంతో జగన్ ముఖ్యమంత్రి కాబోతున్నారని అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చే సమయంలో తాను ఎమ్మెల్యేగా ఉండటం చాలా సంతోషంగా ఉందన్నారు.
వైఎస్ జగన్ ను ప్రజలు ఎంత అభిమానిస్తున్నారనేదానికి లేటెస్ట్ గా వచ్చిన ఎన్నికల పలితాలే నిదర్శనమన్నారు రోజా. ఈ ఫలితాలతో జగన్‌పై బాధ్యత కూడా చాలా పెరిగిందన్నారు. మొదటి సంవత్సరంలోనే మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానని జగన్ చెప్పారని.. ఇప్పటివరకు ఏ సీఎం కూడా ఇలా చెప్పలేదని ఆమె గుర్తుచేశారు. జగన్ తన తండ్రిలా రాష్ట్ర ప్రజలను అభిమానించారని.. ప్రజల కష్టాలు దూరం చేయాలనుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు జగన్ సిద్ధమయ్యారని అన్నారు. ఎవరి మద్దతు తీసుకోకుండా చంద్రబాబు ఎన్నికల్లో పోటీ చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో ఈ ఎన్నికలతో తెలిసిపోయిందన్నారు రోజా.
