బొట్టు పెట్టుకోవాలంటే బీజేపీ గెలవాలే: రాజాసింగ్

కొడంగల్, వెలుగు: హిందూవులు బొట్టు పెట్టుకోవాలంటే కేంద్రంలో బీజేపీ గెలవాలని, మోదీ మరోసారి ప్రధాని కావాలని బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, వెంకటరమణా రెడ్డి, ఎంపీ క్యాండిడేట్​ డీకే అరుణ పేర్కొన్నారు. మంగళవారం కొడంగల్​ అంబేద్కర్​ చౌరస్తాలో డీకే అరుణకు మద్దతుగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నాటకలో హిందువులకు రక్షణ లేదని, హనుమాన్​ చాలీసా చదవడం కర్నాటకలో నేరమని, కాంగ్రెస్​ యూపీఏ పేరుతో లక్షల కోట్ల కుంభకోణం చేసిందని, అందుకే పేరు మార్చుకుని ఓట్లు అడిగేందుకు వచ్చిందని ఆరోపించారు. 

కేసీఆర్​ రాష్ట్రాన్ని మత్తు తెలంగాణగా మార్చిండని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వల్లనే తెలంగాణ అభివృద్ది చెందిదని తెలిపారు. తెలంగాణను బీఆర్ఎస్​ సర్వ నాశనం చేసిందన్నారు. ఎంఐఎం నాయకులు తెలంగాణలో ఎవరు అధికారంలో ఉంటే వారి కాళ్లు పట్టుకుంటారని దుయ్యబట్టారు. త్వరలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని, అప్పుడు తెలంగాణ నుంచి తరిమికొడతామని హెచ్చరించారు. కొడంగల్​ గడ్డ రేవంత్​ అడ్డా కాదన్నారు. పాలమూరుకు రేవంత్​ ఏమి చేసిండని ప్రశ్నించారు. బాధ్యత గల హోదాలో ఉండి రేవంత్​ దిగజారుడు మాటలు మాట్లాడుతున్నాడని, కేసీఆర్​కు పట్టిన గతే రేవంత్​కు పడుతుందని విమర్శించారు. దేశం సురక్షితంగా ఉండాలంటే, బీజేపీకి ఓటు వేసీ మోదీని ప్రధాని చేయాలని కోరారు.

కేంద్రంలో బీజేపీ ధికారంలో ఉంటేనే దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందని రాజాసింగ్  తెలిపారు. బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ కు మద్దతుగా జహీరాబాద్ లో రోడ్ షో నిర్వహించారు. మోదీని ఓడించేందుకు భారత్ తో పాటు పాకిస్తాన్ లోనూ కుట్ర జరుగుతోందని ఆరోపించారు. పాక్  పాలకులు సైతం భారత్ లో మోదీ ఓడిపోయి రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్  క్యాన్సర్  కంటే భయంకరమైన పార్టీ అని, ఆపార్టీ కి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఎంపీగా బీబీ పాటిల్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు