మల్లన్న కల్యాణంలో ప్రొటోకాల్ రగడ

  • ఎమ్మెల్యేను వేదికపైకి ఆహ్వానించని అధికారులు

కొమురవెల్లి, వెలుగు: చట్ట ప్రకారం ప్రొటోకాల్ పాటిస్తే అందరికీ బాగుంటుందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న స్వామి కల్యాణానికి హాజరైన ఆయనను అధికారులు వేదిక వద్దకు ఆహ్వానించకపోవడంతో సాధారణ గ్యాలరీలో కూర్చొని కల్యాణ తంతును తిలకించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. దేవుడి విషయంలో తాను రాజకీయం చేయదల్చుకోలేదని స్పష్టం చేశారు.

కొమురవెల్లి మల్లికార్జునస్వామి కల్యాణ మహోత్సవానికి వేలాది మంది భక్తులు వచ్చేవారని, ఈ సారి భక్తుల సంఖ్య చాలా తగ్గిందన్నారు. వచ్చే ఏడాది మౌలిక వసతులు, సౌకర్యాలు పెంచి భక్తులు ఎక్కువగా వచ్చేలా చూడాలని అధికారులకు సూచించారు. నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలని మల్లన్న స్వామిని కోరుకున్నట్లు తెలిపారు.