మెదక్, వెలుగు: మెదక్అసెంబ్లీ సెగ్మెంట్సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక రెడీ చేశామని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు తెలిపారు. శుక్రవారం చిన్నశంకరంపేట, హవేలీ ఘనపురం మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా కచన్ పల్లిలో కాంగ్రెస్ నాయకుడు శేరి మహేందర్ రెడ్డి స్వగృహంలో రోహిత్ మీడియాతో మాట్లాడారు. మెదక్ ఖిల్లా, చర్చి, పోచారం అభయారణ్యం, ఏడుపాయలను టూరిజం స్పాట్లుగాఅభివృద్ధి చేస్తామని చెప్పారు.
మెదక్ చర్చిలో ఏసు క్రీస్తు భారీ విగ్రహం ఏర్పాటు చేయాలని సంకల్పించినట్లు తెలిపారు. జిల్లాలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొన్నారు. మెదక్,- చేగుంట మెయిన్‌రోడ్డు మీద ఉన్న కొంటూర్ చెరువు ప్రాంతాన్ని మినీ ట్యాంక్‌బండ్ గా తీర్చిదిద్ది, కట్ట మీద మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయిస్తామన్నారు. కన్సర్ వేటర్ ఆఫ్ ఫారెస్ట్, డ్రగ్స్ కంట్రోల్ ఆఫీస్ ఏర్పాటు విషయం సీఎం, మంత్రుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
తరలిపోయిన పీజీ కాలేజీ, కూచన్‌పల్లి విద్యార్థులు, తల్లిదండ్రుల కోరిక మేరకు ఎస్.ఎస్.సి. సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ హన్మంత రెడ్డి, కాంగ్రెస్నాయకులు పవన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హఫీజ్ మోల్సాబ్, శ్రీనివాస్, మహేందర్ రెడ్డి, పరుశురాం గౌడ్, బాలకిషన్, పద్మారావు, శ్రీనివాస్, కిరణ్ గౌడ్, సిరిమల్లె శ్రీనివాస్, శ్రీకాంత్, అక్బర్, నాగిరెడ్డి, బూర్గుపల్లి శ్రీనివాస్, రాములు, యాదగిరి, సంతోష్, మాజీ సర్పంచ్ దేవ గౌడ్ ఉన్నారు.
కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే
నిజాంపేట: మండల కేంద్రంతో పాటు నస్కల్ గ్రామంలో పీఏసీఎస్, ఎఫ్ పీ వో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం రాంపూర్ గ్రామంలో 26 మంది గౌడ సంఘం సభ్యులకు కాటమయ్య కిట్లను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా బీసీ వెల్పేర్ ఆఫీసర్ నాగరాజు, ఎక్సైజ్ సీఐ సుధ, డీటీఎఫ్ సీఐ నరేందర్, ఎస్ఐలు బాలయ్య, విజయ్ సిద్దార్థ్, మండల సర్పంచ్ ల ఫోరమ్ మాజీ ప్రెసిడెంట్ అమర సేనా రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు యాదగిరి పాల్గొన్నారు.