సెక్రటేరియెట్​ పక్కన అసెంబ్లీ ఉండాలి : ఎమ్మెల్యే రాజగోపాల్​రెడ్డి

  • ఎన్టీఆర్ ఘాట్ లో నిర్మిస్తే బెటర్

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీకి కొత్త బిల్డింగ్ అవసరమని, సెక్రటేరియెట్ పక్కన ఎన్టీఆర్ ఘాట్ లో నిర్మిస్తే  బాగుంటుందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. హుస్సేన్ సాగర్​ ఒడ్డున తెలంగాణ అసెంబ్లీ  వ్యూ బాగుంటుందని చెప్పారు. సెక్రటేరియెట్, అసెంబ్లీ పక్క పక్కనే ఉంటే పాలనాపరంగానూ బెటర్​గా ఉంటుందని వివరించారు . మంగళవారం అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీని తరలించాల్సిన అవసరం ఉందని అన్నారు. కొత్త సెక్రటేరియెట్ నిర్మించినట్లుగానే.. కొత్త అసెంబ్లీ భవనం కూడా నిర్మించాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. 

ఎన్టీఆర్ గార్డెన్‌లో కొత్త అసెంబ్లీ భవన నిర్మాణానికి అవసరమైతే హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ పరిధిని కుదించవచ్చని చెప్పారు. కొత్త సెక్రటేరియెట్, అసెంబ్లీ, అమరవీరుల స్థూపం.. ఇవన్నీ హుస్సేన్ సాగర్ ఒడ్డున చూడ చక్కగా ఉంటాయని అన్నారు.  గోదావరి జలాలతో జంట నగరాల్లోని కుంటలు, చెరువులను నింపొచ్చని, ప్రభుత్వం ఈ అంశంపై పరిశీలన చేయాలన్నారు. ఇక తన మంత్రి పదవిపైనా రాజగోపాల్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. తనకు మంత్రి పదవి వచ్చేది రానిది అధిష్టానం చేతుల్లో ఉందని తెలిపారు. తాను మంత్రి పదవి ఆశిస్తున్న మాట వాస్తవమేనని చెప్పారు. ఈ రేసులో తాను ముందున్నట్టు రాజగోపాల్​రెడ్డి వెల్లడించారు.