15 రోజుల్లో రైతులకు సాగు నీరు అందిస్తాం : ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

  • వారం రోజులలో కాలువ నిర్మాణం పనులు పూర్తి 

ఆమనగల్లు, వెలుగు:  కెఎల్ఐ పథకంలో భాగంగా డి 82 కాలువను వారం రోజుల్లో  పూర్తి చేసి 15 రోజుల్లో  చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు అందిస్తామని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గురువారం ఆయన ఆమనగల్లు మండలంలోని సింగంపల్లి, మాడ్గుల్ మండలంలోని నాగిల్ల - దొడ్లపహాడ్ గ్రామాల మధ్య అసంపూర్తిగా ఉన్న కాలువ నిర్మాణం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కాలువ నిర్మాణంలో అసంపూర్తికి గల కారణాలను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

నిర్మాణంలో భాగంగా కాలువ మధ్య బండ రావడం, పక్కనుంచి మిషన్ భగీరథ పైప్ లైన్ ఉండడంతో బ్లాస్టింగ్ చేసేందుకు ఇబ్బంది ఏర్పడడంతో పనులలో జాప్యం జరుగుతుందని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..  కాలువ పక్క నుంచి తాత్కాలికంగా తాగునీటి పైపులైను ఏర్పాటు చేయాలని రూ.10 లక్షల రూపాయలను తాను అందజేస్తానన్నారు. కాసాంకేతిక కారణాలతో ఆగిపోయిన రూ. 15 కోట్ల రూపాయలను దసరాలోగా విడుదల చేయిస్తానని హామీ ఇచ్చారు.

భూములు కోల్పోకుండా చర్యలు తీసుకోవాలి..

 త్రిబుల్ ఆర్ రోడ్డు నిర్మాణంలో భాగంగా ఆమనగల్లు మండలం సింగంపల్లి గ్రామంలో తమ భూముల మీదుగా రోడ్డు నిర్మాణం కోసం మార్కింగ్ చేశారని తమ భూముల మీదుగా రోడ్డు వెళ్లకుండా భూములకు రక్షణ కల్పించాలని దళితులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కు విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఎమ్మెల్యే సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.