కేటీఆర్​పై పెట్టింది లొట్టపీసు కేసు..రేవంత్ రెడ్డివి డైవర్షన్ పాలిటిక్స్ : జగదీశ్ రెడ్డి

  • రైతుభరోసా నుంచి దృష్టిమరల్చే కుట్ర అని ఫైర్
  • అరెస్ట్ చేయాలనే దురాశ తప్ప ఏం లేదు: ప్రశాంత్ రెడ్డి 

హైదరాబాద్, వెలుగు: ఫార్ములా ఈ రేస్ కేసు నుంచి కేటీఆర్ మల్లెపువ్వు లెక్క బయటపడ్తారని ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఒకరిద్దరు అధికారుల సాయంతో కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కేటీఆర్​పై పెట్టిన కేసులో ఏమీ లేదని, అదొక లొట్టపీసు కేసు అని ఎద్దేవా చేశారు. కేటీఆర్ ఇంటి వద్ద మరో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో కలిసి జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

‘‘రేవంత్ రెడ్డివి డైవర్షన్ పాలిటిక్స్. రైతు భరోసా నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కేటీఆర్​పై ఓ చెత్త కేసు బనాయించింది. హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ లీడర్లు సంబురాలు చేసుకుంటున్నరు. వారిది అల్ప సంతోషమే.. ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగినందుకు అక్రమ కేసులు బనాయించారు’’అని జగదీశ్ రెడ్డి అన్నారు. ఏసీబీ విచారణకు కేటీఆర్ వచ్చేసరికి ప్రభుత్వ పెద్దలకు ఏం అర్థం కాలేదన్నారు. అందుకే లాయర్​తో రావొద్దని మెలిక పెట్టారని ఆరోపించారు. 

కాంగ్రెస్ నేతలు ఫ్రస్ట్రేషన్​లో ఉన్నరు: ప్రశాంత్ రెడ్డి

పాలనలో ఫెయిల్ అవుతున్నామన్న ఫ్రస్ట్రేషన్​లోనే ఎప్పుడో 15 నెలల కింద జరిగిన ఫార్ములా ఈ రేసు అంశాన్ని రేవంత్ రెడ్డి ఎత్తుకుని హంగామా చేస్తున్నారని ప్రశాంత్ రెడ్డి అన్నారు. ‘‘కేటీఆర్ ను ఎలాగైనా అరెస్ట్ చేయాలన్న దురాశ తప్ప ఈ కేసులో ఇంకేం లేదు. అందుకే కొన్ని రోజుల నుంచి కాంగ్రెస్ నేతలంతా ఎలక్టోరల్ బాండ్ల విషయాన్ని ప్రస్తావిస్తున్నరు. ఎలక్టోరల్ బాండ్లు.. అన్ని రాజకీయ పార్టీల హక్కు. కాంగ్రెస్ పార్టీకి కూడా గ్రీన్ కో కంపెనీ రూ.25 కోట్లను బాండ్ల రూపంలో ఇచ్చింది. ఇవే బాండ్లతో రూ.1,500 కోట్ల నిధులను సేకరించిన కాంగ్రెస్ పార్టీ కూడా క్విడ్ ప్రో కో చేసినట్టేనా?’’అని జీవన్ రెడ్డి అని ప్రశ్నించారు.