ఇందిరమ్మ కమిటీలు పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక :  ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

పటాన్​చెరు, వెలుగు: పారదర్శకంగా ఇందిరమ్మ కమిటీలు, లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, జీపీ సెక్రటరీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వం సూచించిన నిబంధనలకు అనుగుణంగా గ్రామసభ ఏర్పాటు చేసి  గ్రామ కమిటీలు, వార్డ్ కమిటీలు ఏర్పాటు చేయడంతో పాటు అర్హులైన వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని సూచించారు.

లబ్ధిదారులకు ఖాళీ జాగా ఉంటే ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు సాయం అందిస్తామని తెలిపారు. ఒకవేళ జాగా లేకుంటే అధికారుల పరిశీలన తర్వాత ఖాళీ స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సాయం అందిస్తామని పేర్కొన్నారు. త్వరలోనే ప్రభుత్వం లాంఛనంగా ఈ పథకాన్ని ప్రారంభిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీడీవోలు, మునిసిపల్​ కమిషనర్లు, జీపీ సెక్రటరీలు పాల్గొన్నారు.