పేదల ఆపన్న హస్తం సీఎంఆర్ఎఫ్: ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి 

పటాన్​చెరు, వెలుగు: పేదల ఆపన్న హస్తం సీఎంఆర్​ఎఫ్​అని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్​చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో నియోజకవర్గ పరిధిలోని 118 మంది లబ్ధిదారులకు రూ.43 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారన్నారు. పూర్తి పారదర్శకతతో ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజా పాలన అందిస్తున్నామని తెలిపారు. వచ్చే నెలలో అర్హులైన ప్రతీ ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నగేశ్ యాదవ్, నరసింహారెడ్డి, వెంకటేశ్, రాము, రాజు, సంజీవరెడ్డి, ఇమ్రాన్ పాల్గొన్నారు.