అభివృద్దిని అడ్డుకుంటే సహించేది లేదు : ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి

పాలమూరు, వెలుగు : పాలమూరు అభివృద్ధే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని, దీనిని అడ్డుకుంటే సహించేది లేదని డీసీసీ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ ఆఫీస్​లో సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంత బిడ్డగా పెండింగ్  ప్రాజెక్టులను పూర్తి చేస్తామని సీఎం ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. జిల్లాలోని రెండు ప్రధాన ఆలయాలను అభివృద్ధి చేసేందుకు ప్రపోజల్స్​ సిద్ధం చేయాలని కలెక్టర్​ను ఆదేశించడం హర్షణీయమన్నారు.

ఈ ప్రాంతాన్ని అన్నిరంగాల్లో డెవలప్​ చేసేందుకు సీఎం చర్యలు తీసుకుంటున్నారని, పాలమూరు అభివృద్ధికి అడ్డుపడితే సహించేదిలేదని, తాట తీస్తామని హెచ్చరించారు. గత పదేండ్లుగా అభివృద్ధి పేరుతో ప్రచారం చేసుకున్నారని విమర్శించారు. పాలమూరు–-రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.28 వేల కోట్లు ఖర్చు చేసి 28 ఎకరాలకు కూడా నీళ్లు పారించలేదన్నారు. కేటీఆర్, హరీశ్ రావు ప్రభుత్వాన్ని తప్పుపట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. అధికారం కోల్పోయామనే అక్కసు వారి మాటల్లో కనిపిస్తుందన్నారు.

అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. ఆరు గ్యారంటీల గురించి ఎంపీ మాట్లాడుతుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎంపీగా గెలిచి నాలుగు నెలలవుతున్నా కేంద్రం నుంచి ఒక్క రూపాయి, ప్రాజెక్టు తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు. వినోద్ కుమార్, చంద్రకుమార్ గౌడ్, సీజే బెనహర్, రాములు యాదవ్, అజ్బుత్ అలీ, ఆనేజ్  పాల్గొన్నారు.