నా మాట వినలేదు.. అందుకే జైలు పాలైండు..హేమంత్పై సొంత ఎమ్మెల్యే వ్యాఖ్యలు

నా మాట వినలేదు.. అందుకే జైలు పాలైండు..హేమంత్పై సొంత ఎమ్మెల్యే వ్యాఖ్యలు

 జార్ఖండ్  మాజీ సీఎం హేమంత్ సోరేన్ పై జేఎంఎం ఎమ్మెల్యే హెంబ్రోమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎంగా ఉన్నప్పుడు తన సలహాలు వినలేదు..అందుకే చివరికి జైలు పాలయ్యారని  అన్నారు. రాష్ట్రంలో  పెసా చట్టం అమలు చేసినట్లైతే గిరిజనులకు అండగా ఉండేదని.. కానీ అలా జరగలేదని అన్నారు.  చోటా నాగాపూర్ టెనన్సీ యాక్ట్, సంతాల్ పరగణాల టెనన్సీ యాక్ట్ అమలు చేస్తామని 2019 అసెంబ్లీ ఎన్నికల్లో హేమంత్ సోరెన్ హామీ ఇచ్చారు. గిరిజనుల హక్కులు కాపాడతామని చెప్పారు.  అయితే అధికారంలోకి వచ్చాక హేమంత్ వాటిని మర్చిపోయారు.పంచాయతీ రాజ్  చట్టం1996 అనే కేంద్ర చట్టం కూడా అమలుకు నోచుకోలేదన్నారు  హెంబ్రోమ్ పార్టీ నుంచి వైదొలిగే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. 

హేమంత్ సోరేన్ అరెస్ట్ తర్వాత జార్ఖండ్ సీఎంగా  చంపై సోరెన్ జేఎంఎం, ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి సాయంతో  ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.  దీంతో చంపై  ఫిబ్రవరి 5న  విశ్వాస పరీక్ష ఎదుర్కోనున్నారు. అయితే  ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 47 మంది ఎమ్మెల్యేల మద్దతు తమకుందని జేఎంఎం చెబుతోంది. ఈ క్రమంలో ఆ పార్టీకి చెందిన లోబిన్ హెంబ్రోమ్ ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. 

జార్ఖండ్ లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 81 , అధికార కూటమికి 47 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో జేఎంఎంకు 29, కాంగ్రెస్ 17, ఆర్జేడీ నుంచి ఒకరు ఉన్నారు.  అయితే జేఎంపీ కూటమి తమకు 43 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రకటించింది. ప్రభుత్వ ఏర్పాటుకు మెజారిటీ 41 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. 

మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరేన్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్  జనవరి 31 ఏడు గంటలకు పైగా ప్రశ్నించిన తర్వాత అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే..