రెవెన్యూ రికార్డులను ట్యాంపరింగ్  చేశారు : ఎమ్మెల్యే అనిరుధ్​రెడ్డి

  • మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిపై అనిరుధ్​రెడ్డి ఫైర్

జడ్చర్ల టౌన్, వెలుగు : ప్రభుత్వ భూములను కబ్జా చేసి బినామీలకు అలాట్​మెంట్​ చేయడమే కాకుండా రెవెన్యూ రికార్డులను సైతం ఇష్టానుసారంగా ట్యాంపరింగ్​​చేశారని మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిపై ఎమ్మెల్యే అనిరుధ్​రెడ్డి ఆరోపణలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను గతంలో చేసిన ఆరోపణలను నిరూపించాలని మాజీ ఎమ్మెల్యే పేర్కొనడాన్ని స్వాగతిస్తున్నానని, వాటికి సంబంధించిన ఆధారాలను చూపించారు. మాజీ ఎమ్మెల్యే సోదరి సద్గుణమ్మ పేరిట 1.10 ఎకరాలు, అరుణ్​ కుమార్​ పేరిట 1.08ఎకరాలు అమ్ముకున్నాడన్నారు.

రోడ్డులో పోయిన 22 గుంటల భూమి రికార్డుల్లో అలాగే ఉండడంతో  మళ్లీ రిజిస్ట్రేషన్​ చేసుకున్నారన్నారు. నాలా కన్వెన్షన్​ కూడా లేని ఆ భూమిని కచ్చా లేఔట్​ ద్వారా కొనుగోలు చేశారని తెలిపారు. ఇలా తన బంధువులు, తెలిసిన వారి పేరిట భూములు మార్చుకొని కబ్జా చేశారని ఆరోపించారు. ఆధారాలతో సహా నిరూపిస్తే తన పక్కన కూర్చూంటానని ఆయన అనడం హాస్యస్పదంగా ఉందన్నారు. తాను 8 నెలల్లో 65 అక్రమ ఇసుక కేసులు నమోదు చేయించానని, లక్ష్మారెడ్డి పదేండ్లలో ఎన్ని కేసులు నమోదు చేయించారని ప్రశ్నించారు. శివకుమార్, బూర్ల వెంకటయ్య, నిత్యానందం పాల్గొన్నారు.