స్టాలిన్ ఎప్పటికీ సీఎం కాలేరు

స్టాలిన్ ఎప్పటికీ సీఎం కాలేరు
చెన్నై: తమిళనాడులో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అన్ని పార్టీలు ఎలక్షన్స్‌‌కు సంబంధించిన కసరత్తులు మొదలుపెట్టాయి. అధికార అన్నాడీఎంకే తమ సీఎం అభ్యర్థిని కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష డీఎంకే నుంచి ఎవరు సీఎం అభ్యర్థి అవుతారా అనేది ఆసక్తికరంగా మారింది. డీఎంకే తరఫున పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ సీఎం అభ్యర్థి అని అందరూ అనుకుంటున్న వేళ ఆయన సోదరుడు ఎంకే అళగిరి బాంబు పేల్చారు. స్టాలిన్‌‌ ఎప్పటికీ సీఎం కాలేరని స్పష్టం చేశారు. డీఎంకే కష్టాల్లో ఉన్నప్పుడు తాను చాలాసార్లు ఆదుకున్నానని తెలిపారు. ‘పార్టీలో పదవుల కోసం స్టాలిన్ నా సాయాన్ని కోరాడు. నా ఎదుగుదలను చూసి జెలసీ పెంచుకున్న స్టాలిన్.. నాకే వెన్నుపోటు పొడిచాడు. స్టాలిన్‌‌ను మా తండ్రి కరుణానిధితో పోల్చడం బాధ కలిగిస్తోంది. తమిళనాడుకు కాబోయే సీఎం స్టాలిన్ అంటూ పోస్టర్లు కనిపిస్తున్నాయి. కానీ అది ఎప్పటికీ జరగదు. నా మద్దతుదారులు స్టాలిన్‌‌ను సీఎం కానివ్వరు. కొత్త పార్టీ పెట్టాలని చాలా మంది నన్ను కోరుతున్నారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటా’ అని అళగిరి పేర్కొన్నారు. మధురైతోపాటు దక్షిణ తమిళనాడు జిల్లాల్లో స్టాలిన్‌‌కు మంచి పట్టు ఉంది. మరి స్టాలిన్, అళగిరి ఒక్కటవుతారా.. లేదా అళగిరి వేరు కుంపటి పెట్టుకుంటారా అనేది భవిష్యత్‌‌లోనే తేలనుంది.