IND vs NZ 2nd Test: ఎలా మిస్ చేశావ్ కోహ్లీ..? ఫుల్ టాస్ బంతికి క్లీన్ బౌల్డ్

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్టుల్లో తన పేలవ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. ఒకటి రెండు అడపాదడపా ఇన్నింగ్స్ లు మినహాయిస్తే పదే పదే విఫలమవుతున్నాడు. ఇప్పటికే టెస్టుల్లో కోహ్లీ యావరేజ్ 48కి పడిపోయింది. పూణే వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులోనూ విరాట్ మరోసారి నిరాశపరిచాడు. కేవలం ఒక్క పరుగుకే పెవిలియన్ కు చేరాడు. విఫలమవడం సంగతి పక్కన పెడితే కోహ్లీ ఔట్ అయిన విధానం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 

సాంట్నర్ వేసిన ఫుల్ టాస్ బంతిని ఆడడంలో విఫలమయ్యాడు. స్వీప్ చేసే క్రమంలో క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో పూణే గ్రౌండ్ ఒకసారిగా మూగబోయింది. కోహ్లీ ఔటైనా విధానంపై మాజీలు సైతం షాకవుతున్నారు. దిగ్గజ బ్యాటర్ హోదాలో ఫుల్ టాస్ కు ఔటవ్వడమేంటి అని విమర్శిస్తున్నారు. ఈ సిరీస్ లో భాగంగా బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో కోహ్లీ డకౌటైన సంగతి తెలిసిందే. గత రెండేళ్లుగా టెస్టుల్లో కోహ్లీ పరుగులు చేయడంలో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇప్పటికైనా ఫామ్ లోకి రాకపోతే టీమిండియా మ్యాచ్ లు గెలవడం  కష్టమే.    

ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఆల్ రౌండర్ సాంట్నర్, గ్లెన్ ఫిలిప్స్ విజృంభించడంతో భారత్ రెండో రోజు లంచ్ సమాయానికి 107 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజ్ లో జడేజా(11), సుందర్ (2) ఉన్నారు. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 152 పరుగులు వెనకబడి ఉంది. సాంట్నర్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. ఫిలిప్స్ రెండు.. సౌథీ ఒక వికెట్ పడగొట్టారు. కివీస్ ఈ ఒక్క సెషన్ లోనే 6 వికెట్లు పడగొట్టి భారత్ పై చేయి సాధించింది.