నాగర్ కర్నూలులో మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్

నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం బోయాపూర్, మహాదేవుని పేట, బిజినపల్లి వెళ్లే మార్గ మధ్యలో మిషన్ భగీరథ పైపులైను నెలల తరబడి లీకై నీరు వృధాగా పోతుంది. గత ప్రభుత్వ హాయాంలో నాసిరకమైన పైపులు వేయడంవల్ల పైపులైన్లు ఎక్కడికిక్కడ లీకేజీలు ఆవుతున్నాయి. లీకేజీలు జరిగిన ప్రాంతంలో  నీరంతా రోడ్లపైకి రావడంతో చెత్త, చెదారం చేరి, జమ్ము పెరిగి, బురద నీరుగా మారుతుంది. తిరిగి అదే నీరంతా పైపుల్లోకి చేరుతుంది. కలుషితమైన నీరంతా ఇంటింటికి వెళ్ళే నల్లా నీటిలో కలవడంతో, ఆ నీటిని తాగుతున్న ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.

గ్రామపంచాయతీ అధికారులు పైప్ లైన్ లీకేజీ నుంచి వృధాగా నీరు పోతున్న పట్టించుకోవడం లేదు. రైతుల పంట పొలాల వెంట భగీరథ పైప్ లైన్ లీకేజీ కావడంవల్ల రైతులు పంటలు నష్టపోతున్నారు. ఈ విషయం అధికారులు దృష్టికి తీసుకువెళ్ళినా పట్టించుకోవడం లేదు. లీకేజీల విషయాన్ని ఏఈడీఈ లకు ఫోన్ ద్వారా పలు సమాచారం ఇచ్చినా స్పందన కరువైందని రైతులు చెబుతున్నారు.

పైప్ లైన్ లీకేజీపై అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు స్ధానికులు.పైపులైన్లకు సరైన మరమ్మతులు చేసి ఆయా గ్రామాలకు నీటి ఎద్దడి లేకుండా అందించాలని ప్రజలు కోరుతున్నారు.