చెన్నూరులో మిషన్ భగీరథ ఫెయిల్: ఎమ్మెల్యే వివేక్

మంచిర్యాల: చెన్నూర్‎లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ భగీరథ ఫెయిల్ అయ్యిందని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ అన్నారు. నియోజకవర్గ ప్రజలకు మంచి నీరు అందించేందుకు రూ.100 కోట్లతో చెన్నూర్, క్యాతనపల్లి, మందమర్రి మున్సిపాలిటీల్లో అమృత్ పథకం పనులు జరుగుతున్నాయని తెలిపారు. చెన్నూర్ మున్సిపాలిటీలో దాదాపుగా 80 శాతం పనులు పూర్తి అయ్యాయని పేర్కొన్నారు. చెన్నూర్ నియోజక అభివృద్ధి కోసం 100 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయని.. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నానని చెప్పారు. శనివారం (జనవరి 4) చెన్నూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, శాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బందిని నియమించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహాను కోరానని.. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. మూరుమూల ప్రాంతమైన చెన్నూరు అభివృద్ధి కోసం ఎక్కువ నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశానన్నారు. చెన్నూరులో గత పాలకులు భూ దందాలు, ఇసుక దందాలు చేయడంతో ఎన్నికల్లో వారిని ఓడగొట్టి ప్రజలు నన్ను గెలిపించారని అన్నారు. నేను గెలిచాక అన్నీ ఇల్లీగల్ పనులు ఆపేశానని.. కానీ నన్ను బద్నాం చేయడానికి సోషల్ మీడియాలో కల్పిత వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ALSO READ | రాజశేఖర్ రెడ్డి తర్వాత ఆ ఘనత సీఎం రేవంత్దే: మంత్రి సీతక్క

నేను అవినీతికి చేయను.. నియోజకవర్గంలో ఎక్కడ ఇల్లీగల్ పనులు జరిగినా సహించనని తేల్చి చెప్పారు. అక్రమాలకు పాల్పడే వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సంక్రాంతి తర్వాత మన అందరికీ రైతు భరోసా నిధులు పడతాయని.. ఎవరైతే పంటలు పండిస్తున్నారో వారికి మాత్రమే మంజూరు అయ్యేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని గ్యారంటీలను ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తుందని చెప్పారు.