ఉగ్రవాదిగా మారిన స్పెషల్ పోలీసాఫీసర్

ఉగ్రవాదిగా మారిన స్పెషల్ పోలీసాఫీసర్
శ్రీనగర్ : కొద్ది రోజుల క్రితం అదృశ్యమై, ఉగ్రవాదిగా మారిన స్పెషల్ పోలీసాఫీసర్ (ఎస్‌పీఓ)ను జమ్మూ-కశ్మీరు పోలీసులు అరెస్టు చేశారు.  ముగ్గురు జైషే మొహమ్మద్ ఉగ్రవాదులతో కలిసి ఉండగా ఆయనను బుడ్గాం జిల్లాలో అరెస్టు చేశారు.  జమ్మూ-కశ్మీరు పోలీసులు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, ఎస్‌పీఓ అల్తాఫ్ హుస్సేన్ అక్టోబర్ 24న అదృశ్యమయ్యారు. తనతోపాటు రెండు ఏకే 47 రైఫిళ్ళను పట్టుకుపోయారు. నిర్దిష్ట సమాచారం రావడంతో బుడ్గాం పోలీసులు వెంటనే స్పందించారు. 53 ఆర్ఆర్, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది సహాయంతో బుడ్గాం పోలీసులు హయత్‌పొర, ఛదూరలో సోదాలు నిర్వహించారు. ఈ సమయంలో ఓ వాహనంలోని వ్యక్తులు తమ వాహనంతో అకస్మాత్తుగా దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దానిని అత్యంత చాకచక్యంగా పోలీసులు ఆపగలిగారు. ఆ వాహనంలోని వ్యక్తులు పోలీసులపై దాడి చేసి, తప్పించుకునేందుకు ప్రయత్నించారు. వారిని భద్రతా దళాలు అదుపు చేయగలిగాయి. వీరిలో ఒకరు ఎస్‌పీఓ అల్తాఫ్ హుస్సేన్ అని గుర్తించారు. మిగిలిన ముగ్గురు – షబీర్ అహ్మద్ భట్, జంషీద్ మాగ్రే, జహీద్ దార్ – ఉగ్రవాదులని గుర్తించారు. వీరంతా పుల్వామాకు చెందినవారు. వీరిని అరెస్టు చేసి, ఆయుధాలు, మందుగుండు, ఇతర నేరపూరిత వస్తువులు, పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.