‘ఎవ్రిడే మీల్స్’ ప్రస్తుతానికి గుర్గావ్లో మాత్రమే
న్యూఢిల్లీ: ఫుడ్-డెలివరీ ప్లాట్‌ఫారమ్ జొమాటో ఇక నుంచి హోటల్స్, రెస్టారెంట్ల ఫుడ్డే కాదు.. హోంస్టైల్ భోజనాన్ని కూడా అందించనుంది. అది కూడా కేవలం పది నిమిషాల్లోనే! ఇందుకోసం ఎవ్రిడే మీల్స్ పేరుతో ప్రత్యేక సర్వీసును ప్రారంభించింది. ఇంట్లో మాదిరిగా హోమ్-చెఫ్‌లు వండిన భోజనాన్ని అందిస్తామని తెలిపింది. పది నిమిషాల్లోనే వస్తువులను తెచ్చి ఇచ్చే క్విక్ డెలివరీ సర్వీసులను నిలిపివేసినట్టు వెల్లడించింది. జొమాటో ఎవ్రీడే ప్రస్తుతం గురుగ్రామ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. “ఇంటి భోజనం తినడానికి ఎక్కువ సమయం అవసరం లేదు. ఎక్కువ డబ్బూ అవసరం లేదు. కేవలం రూ. 89తో ప్రారంభమయ్యే మెనూతో మా కస్టమర్లు ప్రతిరోజూ ఆరోగ్యకరమైన భోజనం చేయవచ్చు. మా చెఫ్‌లే స్వయంగా పదార్థాలను తయారు చేస్తారు. ప్రతి వంటకాన్ని ప్రేమతో, శ్రద్ధతో వండుతారు. చాలా తక్కువ ధరలకు ఇవి లభిస్తాయి. పది నిమిషాల్లో మీ ఇంటి ముందు ఉంటాయి” అని కంపెనీ ఒక బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది. ఇంటి రుచులను తెప్పించుకోవడం కూడా ఈజీ అని, మెనూను వెతికి నచ్చిన పదార్థాలను కార్ట్‌లో వేసి ఆర్డర్ చేయవచ్చని పేర్కొన్నది. నిమిషాల్లో ఇంటి వద్దకే వేడిగా రుచికరమైన ఆహారాన్ని అందిస్తామని జొమాటో వర్గాలు తెలిపాయి. జొమాటో ఈ నెల ప్రారంభంలో అక్టోబరు–-డిసెంబర్ క్వార్టర్ ఫలితాలను ప్రకటించింది. తమ ఫుడ్ అండ్ గ్రోసరీ- డెలివరీ ఆదాయం 75శాతం పెరిగి రూ.1,948 కోట్లకు చేరుకుంది. నష్టాలు ఐదు రెట్లు పెరిగి రూ.346 కోట్లకు చేరుకున్నాయి. దీపావళి తర్వాత ఫుడ్ డెలివరీ వ్యాపారం మందగించిందని, మొత్తం ఆర్డర్లు పడిపోయాయని కంపెనీ రెగ్యులేటరీ స్టేట్మెంట్లో పేర్కొంది.
చాలా చోట్ల బిజినెస్ బంద్
బిజినెస్ బాగా లేనందున 225 చిన్న నగరాల్లో తమ సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో ఆర్డర్ల సంఖ్య చాలా తక్కువగా ఉందని, గ్రాస్ ఆర్డర్ విలువ 0.3 శాతంగా ఉన్న చోట్ల సర్వీసులను ఆపుతున్నామని వివరించింది. జొమాటో ఎవ్రీడే అనే కొత్త పేరుతో జొమాటో ఇన్‌స్టంట్‌ను తిరిగి ప్రారంభించనున్నట్లు అప్పుడే తెలిపింది. 10 నిమిషాల డెలివరీ సర్వీస్‌లో చాలా మార్పులు చేస్తామని కంపెనీ గతంలో తెలిపింది.
