గురునానక్ కాలేజీలో టెన్షన్ టెన్షన్.. వారం వ్యవధిలోనే ముగ్గురు బీటెక్ స్టూడెంట్స్ మిస్సింగ్..

గురునానక్ ఇంజినీరింగ్ కళాశాలలో వారం వ్యవధిలోనే ముగ్గురు అదృశ్యమవడం స్థానికంగా తీవ్రకలకలం రేపుతోంది. బీటెక్ ఫస్టియర్ చదువుతున్న ముగ్గురు మిస్సింగ్ అవ్వడం అటు తల్లిదండ్రులలో, ఇటు కాలేజీ యాజమాన్యంలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. విద్యార్థులు అదృశ్యమైనట్లు కళాశాల యాజమాన్యం, తల్లిదండ్రులు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. 

సీఐ మధు తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా మొమిన్ పేట్ మండలం రాంనాథ్ గుడ్ పల్లెకు చెందిన కొత్తగడి విష్ణు (17) ( సీఎఎస్సి ) డిసెంబర్16వ తేదిన మిస్సైనట్లు అతని తండ్రి ఫిర్యాదు చేశారు. మరో విద్యార్థి  యాదాద్రి జిల్లా ఆత్మకూర్ మండలం కప్రాయిపల్లికి చెందిన కొంగరి శివాని(17)  హాస్టల్ నుండి 17వ తేదీన మిస్సైనట్లు గరునానక్ ఇన్టిట్యూషన్స్ ఎజీఎమ్ సర్ధార్ దినేష్ సింగ్ ఫిర్యాదు చేశారు. మరో విద్యార్థి వనపర్తి జిల్లా ఎన్టీఆర్ కాలనీకి చెందిన ఉప్పల పావని(19) 20వ తేదీ నుండి కనిపించడం లేదని అమ్మాయి తల్లి ఇబ్రహీంపట్నం ఫిర్యాదు చేశారు. అదృశ్యమైన ముగ్గురిలో ఇద్దరు మైనర్లు ఉన్నారని సీఐ తెలిపారు.

ముగ్గురి అదృశ్యంపై వేర్వేరు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మధు తెలిపారు. ఒకే కళాశాల నుండి వారం వ్యవధిలో విద్యార్థులు అదృశ్యమవ్వడంపై ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు.