అందాల పోటీల్లో పార్టిసిపేట్ చేసేవాళ్లందరికీ ‘మిస్ యూనివర్స్ కిరీటం’ గెలవాలనే కోరిక ఉంటుంది. వజ్రాలు పొదిగిన కిరీటాన్ని నెత్తిన పెట్టుకుని చిరునవ్వులు చిందించాలని కలలు కంటారు. అయితే, అందంతో పాటు తెలివితేటలతో జడ్జిలను మెప్పించిన వాళ్లకే మిస్ యూనివర్స్ కిరీటం దక్కుతుంది. అందగత్తెలు మనసు పారేసుకునేంత విషయం ఈ కిరీటంలో ఏముంది అనిపిస్తోందా! ఈ కిరీటం డిజైన్, ధర మాత్రమే కాదు... దాని తయారీ వెనకున్న థీమ్ కూడా చాలా స్పెషల్.
ఈ ఏడాది ‘మిస్ యూనివర్స్’గా నిలిచిన హర్నాజ్ సంధు తల మీద అలంకరించిన కిరీటం అందాల పోటీల్లో విజేతలకి ఇచ్చే కిరీటాల్లో కెల్లా ఖరీదైంది. ‘మిస్ యూనివర్స్ మౌవాద్ పవర్ ఆఫ్ యూనిటీ క్రౌన్’గా పిలిచే ఈ కిరీటం ధర 37 కోట్ల రూపాయలు.
స్విట్జర్లాండ్లోని మౌవాద్ అనే ఫేమస్ జువెలరీ కంపెనీ దీన్ని తయారుచేసింది. ‘మిస్ యూనివర్స్’ సంస్థ పాటించే వాల్యూస్ను దృష్టిలో పెట్టుకుని ఈ కిరీటాన్ని డిజైన్ చేశారు ఆర్టిస్టులు. మహిళల శక్తి, మహిళల్ని కలిపి ఉంచే బంధాలకి గుర్తుగా మిస్ యూనివర్స్ కిరీటాన్ని తయారుచేశారు. అనుకున్నది సాధించాలనే తపన, విమెన్ కమ్యూనిటీ, అందం... వీటన్నింటికీ సింబాలిక్ ఈ కిరీటం. ఫెమినిటీ, యూనిటీని స్ఫూర్తిగా తీసుకుని డిజైన్ చేసిన ఈ కిరీటంలో 1,725 తెల్లని వజ్రాలు, మూడు బంగారం రంగు వజ్రాలు పొదిగారు. కిరీటం మధ్యలో 62.83 క్యారెట్ల బరువున్న గోల్డెన్ కనరీ డైమండ్ ఉంది. ఒకదానితో ఒకటి అల్లుకుని ఉన్న ఆకులు, వాటి ఈనెలు, పూల రెక్కలు 7ఖండాల్లో ఉన్న మహిళల్ని రిప్రజెంట్ చేస్తాయి.
