మైనర్​ను వ్యభిచారంలోకి దింపిన తల్లి

మైనర్​ను వ్యభిచారంలోకి దింపిన తల్లి
  • నిందితురాలికి జీవితఖైదు, రూ.2.96 లక్షల జరిమానా

ఎల్బీనగర్, వెలుగు: కన్న కూతురిని బలవంతంగా వ్యభిచారం కూపంలోకి దింపిన మహిళకు రంగారెడ్డి జిల్లా స్పెషల్ సెషన్స్ కోర్టు జీవిత ఖైదుతోపాటు రూ.2.96 లక్షల జరిమానా విధించింది. పోలీసులు, పీపీ కోమలత వివరాల ప్రకారం.. ఖమ్మం పట్టణానికి చెందిన బోడిగడ్డ సంధ్య(35) డైలీ లేబర్. రెండేళ్ల క్రితం తన మైనర్ కూతురుని బలవంతంగా బంధించి వ్యభిచారంలోకి దింపింది. ఓ వ్యభిచార గృహంపై గతేడాది అక్టోబర్ 24న హయత్ నగర్ పోలీసులు దాడి చేయగా, మైనర్ బాలికను తన కన్నతల్లి వ్యభిచారంలోకి దించినట్లు తేలింది.

దీంతో పోక్సో, జ్యూవెనల్, అత్యాచారం, కిడ్నాప్​తో పాటు పలు  సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితురాలిని రిమాండ్​కు తరలించి, కోర్టులో ఆధారాలు సబ్మిట్ చేశారు. సాక్షాధారాలను పరిశీలించిన రంగారెడ్డి జిల్లా స్పెషల్ సెషన్స్ జడ్జి హరీష గురువారం తీర్పును వెలువరించారు. కేసులో నిందితురాలికి శిక్ష పడే విధంగా ఆధారాలు సేకరించిన పోలీస్ సిబ్బందిని రాచకొండ సీపీ అభినందించారు. బాధితురాలికి రూ.12లక్షల నష్టపరిహారం అందజేశారు.